కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ఇండియా మొత్తం లాక్ డౌన్ విధించడంతో సినిమా షూటింగ్స్, రిలీజ్‌లు సర్వం బంద్ చేశారు. అయితే ఈ లాక్‌డౌన్ అనేది దేశ వ్యాప్తంగా మే-03తో ముగియనుండగా.. తెలంగాణలో మాత్రం మే-07 వరకు ఉంటుంది. ఎప్పుడెప్పుడు లాక్‌డౌన్ పూర్తవుతుందా..? షూటింగ్ మొదలెట్టేద్దామా అని దర్శకనిర్మాతలు, నటీనటులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు టాలీవుడ్‌లో షూటింగ్స్ కష్టమనేనని సినీ ఇండస్ట్రీలో.. అటు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
ఎందుకంటే.. షూటింగ్స్ అంటే ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది అవసరమైతే విదేశాలకు కూడా వెళ్లాల్సిందే. ప్రస్తుతం కరోనా భయంతో జనాలు వణికిపోతున్నారు. ఈ టైమ్‌లో ఇతర ప్రాంతాలకు వెళ్లి మళ్లీ తిరిగి రావడం.. ఇంటి నుంచి మళ్లీ ఎక్కడికెక్కడికో పోవడం అంటే జరగని పని. ఇలా చేస్తే ఆ సినిమా యూనిట్ కుటుంబానికి చాలా డేంజర్.. పైగా ఎప్పుడేం జరుగుతుందో..? అని బిక్కి బిక్కి బతకాల్సి వస్తుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అంటే మే నెల మొత్తం షూటింగ్స్ కష్టమే.. అలాగనీ సినిమా రిలీజ్‌లు ఉంటాయంటే అస్సలే కష్టం. జన సమూహం ఎక్కువగా ఉండో చోట వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండటం.. థియేటర్లకు రావాలంటే జనాల్లో భయం.. భయం. సో మే నెల మొత్తం సినిమా రిలీజ్‌లు.. షూటింగ్స్ కష్టమేనన్న మాట.
అంతేకాదు.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతాల్లో షూటింగ్స్ చేసుకుంటామన్నా ప్రభుత్వం నుంచి మాత్రం అనుమతులు వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువే ఉన్నాయ్. దీన్ని బట్టి చూస్తే భారీ బడ్జెట్ సినిమాలు.. స్టార్ హీరోల సినిమాలకు పెద్ద దెబ్బేనని చెప్పుకోవచ్చు. తిరిగి జనాలు థియేటర్లకు ఎలాంటి కరోనా భయం లేకుండా రావాలంటే వచ్చే ఏడాది పడుతుందన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ విషయాలను స్వయంగా టాలీవుడ్ బడా నిర్మాతలే మీడియా, ఇంటర్వ్యూల వేదికగా స్పష్టం చేశారు. మొత్తమ్మీద మళ్లీ పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో.. కరోనా భయం జనాల్లో ఎప్పుడు పోతుందో.. రిలీజ్‌లు, షూటింగ్స్ ఎప్పుడు షురూ అవుతాయో వేచి చూడక తప్పదు మరి.