అందాల రాక్షసి సినిమాతో తెలుగు సినిమాకి పరిచయం అయిన దర్శకుడు హను రాఘవపూడి, నానితో చేసిన క్రిష్ణగాడి వీరప్రేమ గాథ సినిమాతో ఓ మోస్తారు విజయం అందుకున్నాడు. ఈ సినిమా బాగున్నప్పటికీ బ్లాక్ బస్టర్ కాలేకపోయింది. అయితే ఆ తర్వాత శర్వానంద్ హీరోగా చేసిన పడి పడి లేచే మనసు సినిమా యావరేజిగా కూడా నిలవలేకపోయింది. సాయిపల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి శర్వానంద్ మార్కెట్ కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టినట్లుగా వార్తలు వచ్చాయి.
అయితే పడి పడి లేచే తర్వాత హను రాఘవపూడి సినిమా ఎవరితో ఉంటుందనేది ఇంకా తేలలేదు. గతకొన్ని రోజుల నుండి వస్తున్న వార్తల ప్రకారం హనుకి మళయాల హీరో దుల్కర్ సల్మాన్ దొరికాడని అంటున్నారు. మహానటి సినిమాతో తెలుగు సినిమాకి పరిచయం అయిన దుల్కర్, ఇక్కడ డైరెక్ట్ గా సినిమా చేద్దామని చాలా రోజుల నుండి అనుకుంటున్నాడు. హను రాఘవపూడి దుల్కర్ కి కథ కూడా వినిపించాడని టాక్.
దుల్కర్ కి కథ నచ్చి ఓకే చేశాడని అంటున్నారు. ఇప్పటికైతే ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. లాక్డౌన్ ముగిసిన తర్వాతే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా గురించి కన్ఫర్మేషన్ వస్తుందని అంటున్నారు. ఒకవేళ దుల్కర్ ఈ సినిమా ఒప్పుకుంటే హను దశ తిరిగినట్లే అని చెప్పాలి. అటు మళయాలంలో, తమిళంలో పాపులారిటీ ఉన్న నటుడిని డైరెక్ట్ చేసే అవకాశం రావడం అదృష్టమనే చెప్పాలి. మరి ఆ అదృష్టం అతడికి దక్కనుందా లేదా చూడాలి.