రోగుల సంరక్షణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులకు, సిబ్బందికి నిత్యావసర వస్తువులతో పాటు ఉచిత భోజనం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ హాస్పిటల్‌లోని రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోగులు, సిబ్బందితో పాటు హాస్పిటల్‌లో సేవలందిస్తున్న అన్ని విభాగాల సిబ్బందికి ప్రోత్సాహకంగా ఉండేందుకు నిత్యావసర వస్తువులతో పాటు ఉచిత భోజనం అందిస్తున్నట్లు చెప్పారు. లాక్ డౌన్ కొనసాగినన్ని రోజులూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని బాలకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మితుకుమల్లి భరత్, జే ఎస్ ఆర్ ప్రసాద్‌తో పాటు పలువురు అధికారులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.