కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ తీవ్ర నష్టాలని ఎదుర్కొంటుంది. లాక్డౌన్ వల్ల థియేటర్లన్నీ మూతబడిపోవడంతో కొత్త సినిమా రిలీజ్ లన్నీ ఆగిపోయాయి. లాక్డౌన్ ఎప్పుడు ముగుస్తుందో తెలియని కారణంగా ఆ సినిమాలని ఎప్పుడు రిలీజ్ చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే లాక్డౌన్ ముగిసిన తర్వాత కూడా థియేటర్లు తెరుచుకునేలా లేవు. లాక్డౌన్ ఎత్తేసిన ఒక నెలకి థియేటర్లు తెరుచుకుంటాయని చెప్తున్నా కూడా జనాలు సినిమా చూడడానికి వస్తారా అన్న సందేహం నెలకొంది.
వీటన్నింటి వల్ల సినిమాలని డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. పెద్ద సినిమాల సంగతి పక్కన పెడితే చిన్న సినిమాలు ఈ సాహసం చేస్తున్నాయి. లాక్డౌన్ కారణంగా రిలీజ్ ఆగిపోయిన చిత్రం ఈ నెల ఓటీటీలో రిలీజ్ కానుంది. నూతన దర్శకుడు సురేందర్ దర్శకత్వం వహించిన అమృతరామమ్ సినిమాని జీ5 కి అమ్మేశారట. ఈ చిత్రం ఏప్రిల్ 29వ తేదీన అందుబాటులోకి రానుంది.
అయితే లాక్డౌన్ కి పూర్వం రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాల్లో డిజిటల్ మీడియాలో డైరెక్ట్ గా రిలీజ్ అవుతున్న మొదటి చిత్రం ఇదే. మరి అమృతరామమ్ ని ఉదహరణగా తీసుకుని ఓటీటీలో రిలీజ్ చేసే చిత్రాల సంఖ్య మరింత పెరుగుతుందేమో చూడాలి.