కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో సామాన్యుడు మొదలుకుని సెలబ్రిటీ వరకూ ఇంటికే పరిమితం అయ్యారు. సినిమా రిలీజ్‌లు, షూటింగ్‌లు సర్వం బంద్ అయ్యాయి. లాక్‌డౌన్ నిబంధనలు పాటించకపోతే సెలబ్రిటీ అయినా సామాన్యుడు అయినా పోలీసులు మాత్రం ఒకే ట్రీట్మెంట్ చేస్తున్నారు. అయితే.. బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన విక్కీ కౌశల్ లాక్‌డౌన్ అతిక్రమించి బయటికొచ్చాడని.. దీంతో పోలీసులు ఆయన్ను కొట్టి స్టేషన్‌కు తరలించారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అవునా.. అంటూ అభిమానులు ఒకింత ఆందోళన చెందారు. మరోవైపు విషయమేంటో తెలుసుకోవాలని ఆప్తులు ఆయనకు ఫోన్ చేసి ఆరా తీశారు. అయితే ఈ వ్యవహారంపై ఎట్టకేలకు ట్విట్టర్ వేదికగా విక్కీ క్లారిటీ ఇచ్చుకున్నాడు.
నన్ను కొట్టలేదు..!
‘నేను ఎటువంటి లాక్‌డౌన్ నిబంధనలనూ మీరలేదు. నన్ను పోలీసులు కొట్టలేదు.. అదుపులోకీ తీసుకోలేదు. నేను లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి.. పోలీసు దెబ్బలు రుచి చూశానని వచ్చిన వార్తలు నిరాధారం. లాక్‌డౌన్ తొలి రోజు నుంచి నేను నా ఇంటి గడప దాటి బయట కాలు పెట్టలేదు. ఈ తరహా అబద్ధపు వార్తలను ప్రచారం చేయకండి’ అని ట్వీట్టర్ వేదికగా ఆయన ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. ఈ ట్వీట్‌ను ముంబై పోలీసులకు కూడా ఆయన ట్యాగ్ చేశాడు. ఈ సందర్భంగా అలుపెరగకుండా పోరాటం చేస్తున్న పోలీసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపాడు. విక్కీ ట్వీట్‌తో అభిమానుల్లో ఆందోళన తొలగింది.
అంతేకాదు.. వంట చేస్తున్న ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేశాడు. కాగా.. కరోనాపై పోరులో భాగంగా విక్కీ తన వంతుగా పీఎం, సీఎం కేర్స్ ఫండ్‌కు కోటి రూపాయిలు విరాళం ప్రకటించి పెద్ద మనసు చాటుకున్న విషయం విదితమే. ఇటీవలే సోషల్ మీడియా లైవ్ చాట్‌లో అభిమానులతో మాట్లాడిన ఆయన.. స్లీప్ పెరలాసిస్‌తో బాధపడుతున్నట్లు చెప్పాడు. దెయ్యం కన్నా భయంకరమైన స్లీప్ పెరలాసిస్‌ని తాను ఎదుర్కున్నానని.. నిజంగా చాలా భయానకంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు.