టాలీవుడ్ దర్శకేంద్రుడు రాజమౌళి అలియాస్ జక్కన్న తెలుగు సినిమాల కంటే ఎక్కువ ఇతర భాషల మూవీస్ చూస్తుంటారన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఆసార్క్ అవార్డును సొంతం చేసుకున్న ‘పారాసైట్’ మూవీ చూసిన ఆయన ఇంటర్వ్యూలో దానిపై తన అభిప్రాయాన్ని చెప్పాడు. ‘పారాసైట్ సినిమా నాకు నచ్చలేదు. చాలా బోరింగ్‌గా అనిపించింది. సినిమా చూస్తుంటే నిద్ర వచ్చేసింది. అలా మూవీ చూస్తూనే మధ్యలోనే నిద్రపోయాను’ అని జక్కన్న షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే ఆస్కార్ అందుకున్న సినిమా తమరికి ఎందుకు నచ్చలేదు సార్.. అంటూ నెటిజన్లు, సినీ ప్రియులు పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపించారు. తాజాగా జక్కన్న వ్యాఖ్యలపై ‘మిఠాయి’ సినిమా తెరకెక్కించిన ప్రశాంత్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ట్విట్టర్ వేదికగా ఓ లెటర్‌ను విడుదల చేసిన ఆయన పలు సంచలన విషయాలు అందులో వెల్లడించాడు. అంతేకాదు.. రాజమౌళి సినిమాలపై కూడా ఆయన దుమ్మెత్తి పోశాడు.
జక్కన్న సినిమాలపై..
‘పారాసైట్ అనేది అద్భుతమైన ఒరిజినాలిటీ ఉన్న సినిమా. ఈ సినిమా చూసిన జనాలు, ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు కూడా ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా అనే అడ్డుగోడలు కూల్చేసింది ఇది. కానీ ‘బాహుబలి’ని ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు మాట్లాడినట్లు నేనెక్కడా వినలేదు.. చూడలేదు. ఒరిజినాలిటీ గురించి మాట్లాడుకుంటే మీ ‘సై’ సినిమాలో ఓ సీన్ మొత్తాన్ని కాపీ చేసారు. మరికొన్ని సినిమాలు కూడా కాపీలే.. అద్భుతమైన ‘పారాసైట్’ గురించి మీరు ఇలాంటి కామెంట్స్ చేయడం తగదు. ముఖ్యంగా మీ అభిప్రాయాలు తర్కానికి దూరంగా ఉన్నాయి. ఓ విదేశీ చిత్రం ఆస్కార్ అవార్డులు గెలుచుకోవడం మామూలు విషయం కాదు. ‘పారసైట్’ వంటి సినిమాలు ఆస్వాదించాలంటే నిర్దిష్ట ఆలోచనా పరిధి అవసరం. బహుశా మీరు అలాంటి దృక్పథంతో లేరేమో’ అని విమర్శలు గుప్పించాడు.
ఆల్ ది బెస్ట్ అని చెప్పి..!
‘యావత్ ప్రపంచం మెచ్చుకున్న ఓ బృహత్తర చిత్రాన్ని మీరు తేలిగ్గా తీసిపారేశారు. ఇది మీకు సరికాదు. భారతీయ చిత్ర పరిశ్రమకు ప్రతినిధిలాంటి మీరు మమ్మల్నందరినీ మీ వ్యాఖ్యలతో బాధించారనడం సబబుగా ఉంటుంది. మీ సినిమాలేవీ ప్రపంచ వేదికలపై ప్రశంసలకు దరిదాపుల్లోకి కూడా రావని భావిస్తున్నాను. కాబట్టి, యావత్ సినీ ప్రపంచం సమష్టిగా గౌరవించిన ఓ చిత్రంపై విమర్శలు చేసే హక్కు మనకు లేదనుకుంటున్నా. ముఖ్యంగా ఓ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌పై మీరు ఇలాంటి మాటలు మాట్లాడటం తగదు. చివరగా చెప్పాలంటే ఎవరి అభిప్రాయాలకు వాళ్లు అర్హులని భావిస్తాను. ఆల్ ది బెస్ట్’ అని లేఖలో సుధీర్ఘంగా ఆయన రాసుకొచ్చాడు. దీనిపై జక్కన్న ఎలా రియాక్ట్ అవుతాడో వేచి చూడాల్సిందే మరి.