రాజమౌళి సినిమాలకి సంగీతం అందించే ఏకైన సంగీత దర్శకుడు కీరవాణి. రాజమౌళి మొదటి సినిమా నుండి ఇప్పటి ఆర్ ఆర్ ఆర్ వరకు అన్ని సినిమాలకి కీరవాణే సంగీతం అందించాడు. బాహుబలి తర్వాత రిటైర్ అవుతానని చెప్పినప్పటికీ, ఆ నిర్ణయం ఎందుకో మార్చుకున్నాడు. రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడిగా మారిన కీరవాణి, రాజమౌళి సినిమాలకి చాలా మంచి మ్యూజిక్ అందిస్తాడు.
రాజమౌళి సినిమాలకి అందించిన క్వాలిటీ మ్యూజిక్ మిగతా సినిమాలకి అందించడనే విమర్శ కూడా ఉంది. అయితే దానికి కీరవాణి సమాధానం ఈ విధంగా చెప్పాడు. ఎలాంటి మ్యూజిక్ కావాలనేది దర్శకుల మీదే ఆధారపడి ఉంటుంది. వారు ఎలా చేయమంటే నేనలానే చేస్తాను. అంతేకానీ రాజమౌళికి ఒకలాగా, వేరే దర్శకులకి ఒకలాగా చేయను అని చెప్పాడు. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న కీరవాణి ఒకానొక ఇంటర్వ్యూలో రాజమౌళిలో తనకి నచ్చని విషయం గురించి చెప్పాడు.
ముందుగా నచ్చే విషయాల గురించి చెప్తూ, రాజమౌళి చాలా ఏకాగ్రతతో పనిచేస్తాడని చెప్పాడు. ఇక నచ్చని విషయాల గురించి మాట్లాడుతూ, రాజమౌళి ఎక్కువగా చిన్న పిల్లల సినిమాలు చూస్తాడని, నాకేమో ఆ సినిమాలు నచ్చవని చెప్పుకొచ్చాడు. ఇంకా నేనేదైనా సినిమా చూడమని చెప్తే, చూస్తా చూస్తా అంటాడే కానీ అస్సలు చూడడని అన్నాడు.