లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగులు లేక ఇంట్లోనే గడుపుతున్న సెలెబ్రిటీలు, సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకి దగ్గరగా ఉంటూ ఆనందం పంచుతున్నారు. ఈ మధ్యే ట్విట్టర్ లో జాయిన మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ ఫోటోలని షేర్ చేస్తూ, వాటి వెనక ఉన్న ఆసక్తికరమైన కథల్ని మనతో పంచుకుంటున్నారు. అయితే సోషల్ మీడియాలో ఈ మధ్య రియల్ మ్యాన్ ఛాలెంజి వైరల్ గా మారింది.
ఈ ఛాలెంజి ప్రకారం ఇంటి పనుల్లో మగవాళ్ళు కూడా పాలు పంచుకోవాలి. ఇలు ఊడవడం, తుడవడం, గిన్నెలు కడగడం వంటి పనులని చేసి, వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలి. అయితే ఈ ఛాలెంజిని తీసుకుని వీడియో షేర్ చేసిన వారిలో రాజమౌళి, కీరవాణి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ , మెగాస్టార్ చిరంజీవి, అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం అందరూ బాలయ్య రియల్ మ్యాన్ వీడియో కోసం ఎదురుచూస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ తాను ఛాలెంజిని పూర్తి చేసిన తర్వాత బాలయ్య గారిని, చిరంజీవి గారిని, వెంకటేష్ గారిని నామినేట్ చేశాడు. మెగాస్టార్ ఈ రోజు ఉదయం వీడియో షేర్ చేసి, రియల్ మ్యాన్ టాస్క్ ని పూర్తి చేశాడు. ఇక ఇప్పుడు అందరి చూపు బాలయ్య మీదే పడింది. బాలయ్య ఎన్టీఆర్ చేసిన ఛాలెంజిని స్వీకరించి ఇంటి పనుల్లో భాగం పంచుకున్న వీడియోని ఎప్పుడు వదులుతారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.