ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరి మనసుల్లోనూ కలవరపెడుతున్న ప్రశ్న ఇది. యంగ్ డైరెక్టర్స్‌తో పనిచేయడానికి ఇష్టపడతానని చెప్పిన మెగాస్టార్.. ‘ఆచార్య’ మూవీ తర్వాత ఏయే దర్శకులతో పనిచేయాలనుకుంటున్నదీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘లూసిఫర్’ రీమేక్‌ను ‘సాహో’ డైరెక్టర్ సుజిత్‌తో చేస్తానని తెలిపిన ఆయన, ఆ తర్వాత బాబీ, మెహర్ రమేశ్ లాంటి డైరెక్టర్స్‌తో చేస్తానని చెప్పడం ఇండస్ట్రీ వర్గాల వారందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. వరుసగా ఆయన ఎందుకు ఫ్లాప్ డైరెక్టర్స్‌తో పని చేయాలని డిసైడ్ అయ్యారో అర్థం కావట్లేదని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ ఆవేదన వ్యక్తం చేస్తుండటాన్ని బట్టి వాళ్లకు ఆయన నిర్ణయం నచ్చలేదని అర్థం చేసుకోవచ్చు.
‘రన్ రాజా రన్’ సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సుజీత్, తన రెండో సినిమానే ప్రభాస్‌తో చేసే పెద్ద ఛాన్స్ దక్కించుకున్నాడు. కానీ అతను దాన్ని సరిగా ఉపయోగించుకోలేదు. ‘సాహో’ సినిమాను అతను రూపొందించిన విధానం విమర్శలకు తావిచ్చింది. ఒక్క హిందీ వెర్షన్ మినహా మిగతా అన్ని భాషల్లోనూ అది ఫ్లాపయింది. అయినా అతనిపై చిరంజీవి నమ్మకం ఉంచి, ‘లూసిఫర్’ రీమేక్ బాధ్యతలు అప్పగించారు. అతని తర్వాత బాబీ డైరెక్షన్‌లో సినిమా చేయాలనేది ఆయన ఆలోచన అని స్పష్టమైంది. వెంకటేశ్, నాగచైతన్యలతో చేసిన మునుపటి సినిమా ‘వెంకీ మామ’లో కానీ, పవన్ కల్యాణ్‌తో రూపొందించిన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’లో కానీ బాబీ డైరెక్షన్ చాలా మందికి నచ్చలేదు. రెండు సినిమాల్లోనూ స్క్రీన్‌ప్లే లోపాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ ఫ్లాప్ కాగా, ‘వెంకీ మామ’లో ఇద్దరు స్టార్లున్నా మంచి వసూళ్లను సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో బాబీ డైరెక్షన్‌లో చేయడానికి చిరు అంగీకరించడం చాలా మందికి నచ్చలేదు.
ఇక మెహర్ రమేశ్ డైరెక్షన్‌లో చేయాలని ఉందని ఆయన చెప్పడం మాత్రం మెగా ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీ వర్గాల్ని కూడా షాక్‌కు గురి చేసింది. మెహర్ రమేశ్ డైరెక్ట్ చేసిన తెలుగు సినిమాల్లో ఇప్పటి దాకా ఒక్క హిట్టూ లేదు. పైగా అతను డైరెక్ట్ చేసిన నాలుగు తెలుగు సినిమాల్లో ‘శక్తి’, ‘షాడో’ డిజాస్టర్స్ అయ్యాయి. 2013లో వచ్చిన ‘షాడో’ సినిమా తర్వాత మెహర్ డైరెక్షన్‌లో నటించడానికి ఏ స్టార్ హీరో సాహసం చేయలేదు. అలాంటిది ఇన్నేళ్ల తర్వాత ఏం చెప్పి మెగాస్టార్‌ను అతను పడేశాడా? అనే కామెంట్స్ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో అయితే మెగాస్టార్ - మెహర్ రమేశ్ కాంబినేషన్‌పై వస్తున్న ట్రోల్స్‌కు అంతు లేదు. అయితే చిరంజీవి తనను కలుసుకున్న దర్శకుల గురించి చెప్తూ, బాబీ, మెహర్ పేర్లను యథాలాపంగా ప్రస్తావించారనీ, వాళ్లతో ఆయన పనిచేసే అవకాశాలు బహు తక్కువ అనీ అంటున్నవాళ్లున్నారు. చేస్తే బాబీ డైరెక్షన్‌లో చేస్తారేమో కానీ, మెహర్ డైరెక్షన్‌లో ఆయన చేయరని మెగా ఫ్యాన్స్‌లో కొంతమంది బల్లచరిచి మరీ చెప్తున్నారు. చూద్దాం.. ఫ్యాన్స్ అభిప్రాయాలకు విలువనిచ్చే మెగాస్టార్ మున్ముందు ఏం చేస్తారో?