కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తున్న తరుణంలో ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు.. ఈ పోరులో అలుపెరుగని పోరాటం చేస్తున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల్లో నూతన ఉత్సాహం నింపుతూ.. వారి సేవలను గుర్తించి ప్రశంసిస్తూ ఎంతో మంది కవులు, రచయితలు, సింగర్స్ పాటల రూపంలో, కవిత్వాల రూపంలో చెప్పారు. మరీ ముఖ్యంగా తెలుగులో అందులోనూ టాలీవుడ్‌లో అయితే ఇప్పటి వరకూ చాలా పాటలే వచ్చాయ్. ఈ పాటల్లో చాలా వరకు జనాల్లోకి వెళ్లాయి కూడా. అయితే.. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ షేర్ చేసిన ఓ షార్ట్ ఫిల్మ్ అందర్నీ ఆలోచింపజేస్తోంది. ఈ ఫిల్మ్ డాక్టర్స్, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, రైతుల యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తోంది. ఈ బుల్లి చిత్రానికి ‘సెల్యూట్ టు యువర్ ఫ్యామిలీ’ అని పేరు పెట్టారు.
ఏముంది ఇందులో..!?
05:25 నిమిషాల నిడివి గల ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ పీఆర్వోల్లో ఒకరైన ఏలూరు శ్రీను స్వయంగా రచించి డైరెక్ట్ చేయడంతో పాటు ఓ పాత్రలో కూడా నటించి మెప్పించాడు. ‘నేను బాత్రూమ్ క్లీన్ చేయాలా.. నేను.. అసలు నేనెందుకు క్లీన్ చేయాలి’ అని ఫీలైన శ్రీను చివరికి..‘నా బాత్రూమ్ నేనెందుకు కడుక్కోకూడదు.. ఎందుకింత ఇగో.. దీన్నే వృత్తిగా తీసుకుని దేశమంతటా పరిసరాలను పరిశుభ్రం చేస్తున్న నా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు, నాలాగా ఆలోచిస్తే పరిస్థితేంటి..’ అని తెలుసుకుంటాడు. ఇలా యాంకర్ మంజూష, సోనియా చౌదరి, యాంకర్ అరియానా, శరత్ చంద్ర, ఉదయ్ కుమార్‌లు కూడా ముందు ఏదో అనుకుని తర్వాత తెలుసుకుని వారి పనులు వారే చేసుకుంటారు. చివరగా ‘పోలీసులను గౌరవిద్దాం.. డాక్టర్స్‌కు నమస్కరిద్దాం.. మునిసిపల్ వర్కర్స్‌ని పలకరిద్దాం.. రైతును కాపాడుకుందాం.. ప్రభుత్వానికి సహకరిద్దాం..’అనే మాటలతో ఈ షార్ట్ ఫిల్మ్ ముగుస్తుంది.
షేర్ చేసిన నిఖిల్..
ఈ షార్ట్ ఫిల్మ్‌ను యూట్యూబ్‌లో పెద్ద ఎత్తున నెటిజన్లు చూడగా.. కామెంట్లు, లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా.. ఈ ‘సెల్యూట్ టు యువర్ ఫ్యామిలీ’ను యంగ్ హీరో నిఖిల్ తన ట్వి్ట్టర్ ద్వారా షేర్ చేశాడు. ఈ సందర్భంగా ఈ చిన్న చిత్రాన్ని రూపొందించిన వారందరికీ అభినందనలు తెలిపి.. దీన్ని కంటికి కనపడని మహమ్మారిపై పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ వారికి అంకితం ఇచ్చేలా ఉందని నిఖిల్ కొనియాడటం విశేషమని చెప్పుకోవచ్చు. అంతేకాదు.. ఇందులో నటించిన ప్రతి ఒక్కర్నీ ఆయన అభినందించారు కూడా. ‘సెల్యూట్ టు యువర్ ఫ్యామిలీ’ అని చెబుతూ.. అందరూ ఇంటిపట్టునే ఉండి క్షేమంగా ఉండాలని నిఖిల్ ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు. ఈ ఫిల్మ్‌ను షేర్ చేసిన నిఖిల్‌పై కూడా నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా.. కరోనాపై పోరులో భాగంగా నిఖిల్ తనవంతుగా శానిటైజర్స్, మాస్క్‌లు ఇంకా ఫుడ్‌ను పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, వైద్యులకు అందజేసిన విషయం విదితమే.