టాలీవుడ్ దర్శకేంద్రుడు రాజమౌళి అలియాస్ జక్కన్న తెలుగు సినిమాల కంటే ఎక్కువ ఇతర భాషల మూవీస్ చూస్తుంటారన్న విషయం తెలిసిందే. అలా సినిమాల్లో ఏదైనా సింగిల్ పాయింట్ దొరికితే చాలు ఇక తెలుగులో కథ అల్లేసి తెరకెక్కించేస్తుంటాడు. అలాంటి జక్కన్నకు 2019 సంవత్సరానికి గానూ ఉత్తమ చిత్రంగా ఆసార్క్ అవార్డును సొంతం చేసుకున్న ‘పారాసైట్’ మూవీ ఎందుకో నచ్చలేదట. ఈ సినిమాపై తాజాగా ఓ ప్రముఖ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒకింత షాకింగ్ కామెంట్సే చేశారు. అసలు ఆయనకు ఎందుకు నచ్చలేదు..? సినిమాపై ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు..? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నాకు నచ్చలేదు..!
‘పారాసైట్ సినిమా నాకు నచ్చలేదు. చాలా బోరింగ్‌గా అనిపించింది. సినిమా చూస్తుంటే నిద్ర వచ్చేసింది. అలా మూవీ చూస్తూనే మధ్యలోనే నిద్రపోయాను’ అని జక్కన్న షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే ఆస్కార్ అందుకున్న సినిమా తమరికి ఎందుకు నచ్చలేదు సార్.. అంటూ నెటిజన్లు, సినీ ప్రియులు పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపించారు. అంతేకాదు మీకు నిద్ర రావడం కాదు సార్.. నిద్ర టైమ్‌లో సినిమా చూసినట్లున్నారని.. అందరికీ నచ్చిన మెచ్చిన మూవీ.. అందులోనూ ఆస్కార్ అవార్డ్ అందుకోవడమంటే ఆషామాషీ విషయం కాదు కదా.. అలాంటిది ఎందుకు నచ్చలేదో అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంత పెద్ద డైరెక్టర్ అయినా మీరే ఆ సినిమాను అర్థం చేసుకోలేకపోయారా..? మళ్లీ చూడండి సార్ సినిమా గురించి అప్పుడు తెలుస్తుందని కొందరు ఉచిత సలహాలు ఇస్తున్నారు.
సినిమా ఇదీ..!
సినిమా కథ విషయానికొస్తే.. దక్షిణ కొరియాలో పేద, ధనవంతుల జీవనం మధ్య వ్యత్యాసాన్ని తెలుపుతూ బాన్ జూన్ హో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఓ పేద కుటుంబంలోని నలుగురు వ్యక్తులు.. కడుపు నింపుకోవడమే గగనంగా ఉన్న పరిస్థితుల్లో.. ఉద్యోగాల కోసం ఓ ధనిక కుటుంబం పంచన చేరుతారు. తామంతా ఒకే కుటుంబం అన్న విషయాన్ని యజమానుల దగ్గర దాచిపెడతారు. వాళ్ల కన్నా ముందు ఆ ఉద్యోగాలు చేస్తున్న వారిని మోసపూరితంగా ఆ ఇంటి నుంచి వెళ్లగొడతారు. అయితే.. వీరంతా ఒకే ఫ్యామిలీకి చెందిన వారని తెలుసిపోతుంది.. తర్వాత ఏం జరిగింది? ఉద్యోగులు పోతాయనే భయంతో వారంతా ఏమేం చేశారు..? అనే ఆసక్తికర విషయాలతో సినిమా తెరకెక్కింది. ఇది కేన్స్ చిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా.. ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా గోల్డెన్ గ్లోబ్ పురస్కారం అందుకున్నది. ఆస్కార్ ఉత్తమ చిత్రంగా ఈ చిత్రం దక్కించుకోవడం విశేషమని చెప్పుకోవచ్చు. కాగా ఈ సినిమాను కోలీవుడ్ నుంచి కాపీ చేసి తెరకెక్కించారనే విమర్శలు అవార్డ్ వచ్చిన తర్వాత వెల్లువెత్తాయి.