రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ గురించి రోజుకో వార్త వస్తుంది. మోషన్ పోస్టర్ తో పాటు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుండి ఆర్ ఆర్ ఆర్ పై ఆసక్తి బాగా పెరిగింది. అయితే రామ్ చరణ్ లుక్ తో అంచనాలు పెంచేసిన రాజమౌళి...ఎన్టీఆర్ లుక్ కోసం వెయిట్ చేసేలా చేశాడు. అయితే లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోవడంతో అందరికీ సినిమా రిలీజ్ పై టెన్షన్ పట్టుకుంది.
ఇప్పటికే ఒకసారి వాయిదా పడ్డ ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ అనుకున్న సమయానికి విడుదల అవుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా సామాజిక దూరం పాటించాలన్న నేపథ్యంలో షూటింగులకి ఎప్పుడు అనుమతి లభిస్తుందో తెలియదు. అదే కాదు ఆర్ ఆర్ ఆర్ లో ప్రతినాయకులుగా హాలీవుడ్ యాక్టర్స్ నటిస్తున్నారు. అంతర్జాతీయ రాకపోకలు స్టార్ట్ అయితే కానీ వారు ఇండియాకి వచ్చే వీలు లేదు.
వీటన్నింటి నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ అనుకున్న సమయానికి రావడం కష్టమే అంటున్నారు. అయితే ఈ విషయంలో చిత్రబృందానికి కూడా క్లారిటీ లేదట. రాజమౌళి కూడా రిలీజ్ విషయమై ఇదే మాట చెప్తున్నాడు. లాక్డౌన్ మొదట్లో ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ వాయిదా పడే అవకాశమే లేదని చెప్పారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ కరోనా ప్రభావం మరింతగా పెరుగుతుండడంతో రిలీజ్ డేట్ ఎప్పుడనేది క్లారిటీ లేదంట.