టాలీవుడ్ డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన తెరకెక్కించిన సినిమాలే ఆయన రేంజ్, క్రేజ్ ఏంటో చెబుతాయి. ఏ విషయం అయినా సరే ఎలాంటి మొహమాటం లేకుండా ముక్కుసూటిగా మాట్లాడే డేర్ పర్సన్ పూరీ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరీ ముఖ్యంగా తాను ఎలా డేర్‌గా ఉంటాడో తెరకెక్కించే సినిమాల్లో హీరోల క్యారెక్టరైజేషన్స్‌ని అలాగే తీర్చిదిద్దుతుంటారు. కాగా.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను ఆయన పంచుకున్నాడు. తన మొదటి సినిమా ‘బద్రి’ మొదలుకుని నిన్నా మొన్న వచ్చిన సినిమాల వరకూ అన్నింటినీ గుర్తు చేసుకున్న ఆయన.. ఒక్కో సినిమా గురించి వివరించాడు. అంతేకాదు.. ఎవరెవరితో సినిమాలు మిస్ అయ్యాయనే విషయాలు కూడా చెప్పాడు. మరోవైపు తాను ఇంకా ఎవరెవరితో సినిమాలు చేయాలనుకుంటున్నాడో కూడా చెప్పేశాడు.
ఆయన కల్మషం లేని వ్యక్తి
నటసింహ నందమూరి బాలకృష్ణతో ‘పైసా వసూల్’ తీసి ఫర్లేదు అనిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా చేయడానికి తాను పడ్డ కష్టాలను కూడా వివరించాడు. బాలయ్యతో మళ్లీ ఇంకో సినిమా చేయాలనుంది. నాకు బాలకృష్ణ నవ్వంటే చాలా ఇష్టం. ఆయనతో సరదాగా సాగిపోయే పాత్ర చేయించాలనుకున్నాను. అందుకే పైసా వసూల్ మూవీ చేశాను. హీరో పాత్రకు ‘తేడా సింగ్’ అనే పేరు పెట్టినప్పుడు ఎందుకిలా పెట్టావ్ అని గానీ.. ఒక్క మాటంటే ఒక్క మాట కూడా అడగలేదు. నిజంగా.. బాలయ్య సినిమాల్లోనే కాదు బయట కూడా చాలా ఎనర్జీగా ఉంటారు. ఆయన కల్మషం లేని వ్యక్తి. ఆయనకంటూ ఓ క్యారెక్టర్ ఉంది.. మాట మీద నిలబడతాడని బాలయ్య గురించి పూరీ జగన్ చెప్పుకొచ్చాడు.
నేను రెడీ..
మరీ ముఖ్యంగా తనతో సినిమా చేయొద్దని చాలా మంది బాలయ్యకు చెప్పినప్పటికీ ఆయన మాత్రం అవన్నీ పట్టించుకోకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు. బాలయ్యతో సినిమా చేయడానికి తాను సిద్ధంగానే ఉన్నానని చెప్పుకొచ్చాడు. అందుకే.. బాయ్య ఎప్పుడంటే అప్పుడు రెడీ.. ఆయన కోసం కథ సిద్ధం చేసే పనిలో నిమగ్నయ్యానని కూడా చెప్పేశాడు. బాలయ్యా ఇక లేటెందుకు.. అసలే హిట్ పడి చాలా రోజులైంది.. ఆలస్యం మెందుకు పూరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయ్ బాలయ్యా..!