కరోనా కారణంగా రోజువారి కూలీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వలస కూలీల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. అన్ని పరిశ్రమలు మూతబడిపోవడంతో ఉపాధి కోల్పోయి, వసతి లేక, తినడానికే తిండిలేని పరిస్థి ఎదురైంది. అయితే వీరి బాధలు తీర్చడానికి కొందరు ముందుకు వస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో రోజువారి సినీ వర్కర్ల ఆకలి తీర్చడానికి చిరంజీవి నేతృత్వంలో కరోనా క్రైసిస్ ఛారిటీని ఏర్పాటు చేసి విరాళాలు సేకరిస్తున్నారు.
టాలీవుడ్ లో చాలా మంది సెలెబ్రిటీలు ఈ ఛారిటీకి విరాళం అందించడానికి ముందుకు వచ్చారు. అయితే అందులో హీరోయిన్స్ చాలా తక్కువ మందే ఉన్నారు. సినిమాల్లో కోట్లకి కోట్లు పారితోషికం తీసుకునే హీరోయిన్లు ఈ ఛారిటీకి విరాళం ఇవ్వడానికి ఎందుకు ముందుకు రావట్లేదో అర్థం కావట్లేదు. అయితే హీరోయిన్లు విరాళం ఇవ్వకపోవడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తూ విమర్శలు చేస్తున్నారు.
హీరోయిన్ శృతి హాసన్ కి కూడా ఇలాంటి తాకిడి మొదలైంది. అయితే నెటిజన్ల కామెంట్లకి శృతి హాసన్ సమాధానమిస్తూ, నేనేం చేయాలో నాకెవరూ చెప్పక్కర్లేదనీ, ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసని.. ఒకరు చెప్తే నేను చేయడానికి సిద్ధంగా లేదని తెలిపింది. ఎవ్వరూ ఆదేశించద్దని చెప్పిన శృతిహాసన్ ఎప్పుడు ముందుకు వస్తుందో చూడాలి.