రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. రౌద్రం, రణం, రుధిరం అనే పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపిస్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తున్నాడు. ఎన్టీఆర్ కి జోడీగా బ్రిటన్ భామ ఒలివియా మోరిస్ నటిస్తుండగా, రాం చరణ్ కి జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ మెరుస్తోంది.
ఒకానొక ప్రత్యేక పాత్రలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ నటిస్తున్నాడు. అయితే ఈ పాత్రకోసం అజయ్ దేవగణ్ తీసుకోవడానికి కారణం చెప్పాడు రాజమౌళి. సినిమాలో ఈ పాత్రకి చాలా ప్రాముఖ్యత ఉందట. కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజులు ఇళ్లనుండి పారిపోయి అజయ్ దేవగణ్ వద్దకి చేరుకుంటారట. అజయ్ దేవగణ్ స్ఫూరిత్తోనే వారిద్దరిలో స్వాతంత్ర్య కాంక్ష కలుగుతుందట.
అలాంటి పాత్రలో నటించేటపుడు ఆ వ్యక్తి చెప్పే మాటలు నమ్మేలాగా ఉండాలట. పాత్ర ఏం చెప్పినా, అది నిజమే అని అనిపించేలా ఉండే నటుడి కోసం వెతికితే రాజమౌళికి అజయ్ దేవగణ్ కనిపించాడట. క్యాస్టింగ్ విషయంలో రాజమౌళి ఎప్పుడూ మిస్టేక్ చేయడు. కాబట్టి అజయ్ దేవగణ్ పాత్ర ఆర్ ఆర్ ఆర్ లో ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.