జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు గత మూడు నాలుగేళ్ల నుంచి రోజులు అస్సలు కలిసి రావట్లేదు. పవర్ స్టార్‌గా తన రేంజ్ ఏంటో చూపించిన పవన్.. ఇక రాజకీయాల్లోకెళ్లి దున్నేద్దామని రంగంలోకి దూకేశాడు. కానీ అట్టర్ ప్లాప్ అయిపోయాడు. 2019 ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేసిన ఆయన.. ఊహించని రీతిలో ఫలితాలు రావడం ఇప్పటికీ ఎప్పటికీ అటు అభిమానుల్లో.. ఇటు పవన్‌లో జీర్ణించుకోలేని విషయమే. అయితే బ్యాక్ టూ సినిమాస్ అంటూ.. ‘వకీల్ సాబ్’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చేశాడు. అది ఇంకా షూటింగ్ దశలోనే ఉండగానే కరోనా దెబ్బ కొట్టింది. అంటే ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల ప్రజలు.. ఇప్పుడు కరోనా గట్టిగానే దెబ్బ కొట్టాయన్న మాట.
అవన్నీ అట్టర్ ప్లాప్ అంతే..!
వాస్తవానికి ఎన్నో ప్లాన్స్ గీసి గీసి మరీ పవన్ రీ ఎంట్రీ ఇచ్చాడు. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న పవన్ ఆ లోపు గట్టిగానే రెమ్యునరేషన్ రూపంలో వెనకేసుకోవాలని ఎన్నో కలలు కన్నాడు. చకచకా వీలైనంత వరకూ ఐదారు సినిమాలు చేసేస్తే కాస్త అకౌంట్‌లోనూ పడుతుంది.. ఆ డబ్బులు ఎన్నికల్లో పంచుకోవడానికి కలిసొస్తుందని పవన్ భావించాడట. అయితే ఎన్నో టార్గెట్‌లతో రీ ఎంట్రీ ఇస్తే అవన్నీ అట్టర్ ప్లాప్ అవుతున్నాయట. కాగా.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంచిగా పరిపాలిస్తే తానెళ్లి సినిమాలు చేసుకుంటానని పవన్.. మాట నిలబెట్టుకున్నాడని కూడా వైసీపీ వీరాభిమానులు, కార్యకర్తలు సోషల్ గట్టిగానే దుమ్మెత్తిపోశారు.
సగం కూడా రాదేమో!
‘వకీల్ సాబ్’ సినిమా ఈ పాటికే షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చే నెలలో కచ్చితంగా రిలీజ్ అయ్యేది. కానీ కరోనా దెబ్బతో అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితి. మరోవైపు క్రిష్‌తో మూవీ కూడా ఉంది. ఆ తర్వాత హరీష్ శంకర్‌తో కూడా పవన్ మూవీ ఉంది. ఈ రెండు చిత్రాల తర్వాత కూడా ఒకరిద్దరు దర్శకులు క్యూలో ఉన్నప్పటికీ అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. అయితే.. ‘వకీల్ సాబ్’ మూవీ పరిస్థితే ఇలా ఉంటే ఇకా తదుపరి సినిమాల సంగతేంటో దేవుడికే ఎరుక. ఇవన్నీ ఒక ఎత్తయితే పవన్ ఒక్కో సినిమాకు గట్టిగానే పారితోషికం పుచ్చుకుంటాడు. కానీ ఇదంతా ఒకప్పుడు పరిస్థితి. కరోనా దెబ్బతో ఇప్పట్లో పవన్ ఆశించినంత కాదు కదా సగం కూడా ఇచ్చే పరిస్థితుల్లో నిర్మాతలు లేరు. అంటే పవన్‌కు రెమ్యునరేషన్ విషయంలో కరోనా దెబ్బ కొట్టిందన్న మాట.
రెమ్యునరేషన్ కష్టమే..!?
మొత్తానికి చూస్తే.. ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చిన పవన్‌ను కరోనా గట్టిగానే దెబ్బ కొట్టిందన్న మాట. 2024 ఎన్నికలంటే కాస్త అటు ఇటు 2022 చివరికల్లా ఆయుధాలు సిద్ధం చేసుకుని రంగంలోకి దిగాలి. మరి అప్పటికల్లా పవన్ మహా అంటే రెండు లేదా మూడు సినిమాలను మాత్రమే పూర్తి చేయగలడు. రెండు సినిమాలకు కలిపి పవన్ ఇదివరకు సింగిల్ సినిమాకు వచ్చే రెమ్యునరేషన్ వచ్చినా అది పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. టాలీవుడ్‌లో మిగతా హీరోల పరిస్థితి పక్కనెడితే.. ఎన్నో ఎన్నెన్నో టార్గెట్స్ పెట్టుకున్న పవన్ మాత్రం అన్నీ మిస్సయిపోయాడటన్న మాట.