టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినిమాలో చేయాలనే కోరిక ఏ హీరోకైనా.. హీరోయిన్‌కు అయినా కచ్చితంగా ఉంటుంది. చిన్న పాత్ర అయినా సరే చేయడానికి నటీనటులు క్యూ కడుతుంటారు. మెగాస్టార్‌తో చేయాలని ఉందని ఎంతో మంది ఎన్నో ఇంటర్వ్యూలు, స్టేజ్‌ల మీదే తమ మనసులోని మాటను బయటపెట్టారు. అయితే చిరుతో కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘ఆచార్య’ మూవీలో మాత్రం ఎందుకో యంగ్ మెగాస్టార్ పాత్రలో ఎవరనేదానిపై క్లారిటీ రాలేదు. కొన్ని రోజులేమో సూపర్ స్టార్ మహేశ్ బాబు అని.. అబ్బే ఆయన గట్టిగా పుచ్చుకోవాలి అని అనడంతో మళ్లీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దగ్గరికే వచ్చిందని వార్తలు వినిపించాయి.
అంతేకాదు.. వీరిద్దర్నీ రెక్వెస్ట్ చేసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బన్నీ.. తనకు ఛాన్స్ ఇస్తే కచ్చితంగా నటిస్తానని చెప్పాడని కూడా టాక్ వినిపించింది. అయితే ఈ మధ్య మళ్లీ మహేశ్‌నే రంగంలోకి దించాలని కొరటాల శివ భావిస్తున్నాడు. అవకాశమిస్తే తాను రెడీగా ఉన్నట్లు చెప్పాడని ఇటీవలే కొరటాల కాస్త క్లారిటీ కూడా ఇచ్చేశాడు. అంటే మామయ్యతో నటించాలన్ని బన్నీ ఆశలు అన్నీ ఆవిరయ్యాయి. అయితే ‘ఆచార్య’లో మిస్ అయినప్పటికీ మరో సినిమాలో మాత్రం బన్నీ నటించడం పక్కా అని తాజాగా టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.
అదేమిటంటే.. చిరు 153వ సినిమా మలయాళ చిత్రం ‘లూసిఫర్’ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే డైరెక్టర్ సుజిత్ అని దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఆచార్య షూటింగ్ ముగియగానే రీమేక్ మూవీని పట్టాలెక్కించాలని చిరు ప్లాన్ వేస్తున్నాడు. ఈ రీమేక్‌లో మోహన్‌లాల్ పాత్రను మెగాస్టార్ పోషిస్తుండగా.. పృథ్వీరాజ్ పాత్రలో బన్నీ నటిస్తున్నాడని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. బన్నీ అయితేనే ఆ పాత్రకు న్యాయం చేస్తాడని చిరు భావిస్తున్నాడట.
అల్లు అర్జున్ కూడా మామయ్యతో కలిసి పనిచేయాలని ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్నాడు. అంటే రీమేక్ మూవీతో ఆయన ఆశలు ఫలించబోతున్నాయన్న మాట. ఇదే నిజమైతే మామా అల్లుళ్ళ మజాకా ఇక మామూలుగా ఉండదేమో. అప్పట్లో ఈ పాత్రను చెర్రీనే చేస్తాడని వార్తలు వచ్చినప్పటికీ తాజాగా బన్నీనే ఫిక్స్ చేశారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయ్. మరి మెగా కాంపౌండ్ నుంచి దీనిపై ఎలాంటి రియాక్షన్ వస్తుందో ఏంటో..!