టాలీవుడ్ సంచలన దర్శకుడు, వివాదాలకే కేరాఫ్‌గా పిలిపించుకునే రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఎప్పుడూ యమా యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ ఆయన చేసిన వివాదాస్పద ట్వీట్స్‌ను పక్కనెడితే ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నేపథ్యంలో మాత్రం కాస్త మారిన మనిషిగా కనిపిస్తూ ట్వీట్స్ చేస్తూ వస్తున్నాడు. అంతేకాదు.. కరోనాపై పాట పాడి కూడా వినిపించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఇప్పటికే కరోనాపై ఎన్నెన్ని ట్వీట్స్ చేసుంటాయో లెక్కలేసుకోలేం. అభిమానుందరూ వామ్మో కరీనాతో అయినా వర్మలో మార్పురాదేమో కానీ.. ‘కరోనా’తో మాత్రం గట్టిగానే మార్పొచ్చిందని అనుకుంటున్నారు.
ఆ మధ్య మద్యం డోరో డెలివరీ విషయమై తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులకు రెక్వెస్ట్ చేసి మందుబాబులకు అండగా నిలిచాడు!. ఆ తర్వాత మంత్రి కేటీఆర్ రిప్లయ్‌తో కంగుతిని.. పంచ్ దెబ్బకు ముక్కు పగిలిందని ఆర్జీవీ ట్వీట్ చేశాడు. అయితే తాజాగా అగ్రరాజ్యం అమెరికాకు సంబంధించి ఓ ట్వీట్ చేసిన ఆయన.. అంతర్జాతీయ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ నాయకుడు, అమెరికాను గజ గజ వణికించిన ఒసామా బిన్ లాడెన్‌ను ఆయన గుర్తుకు తెచ్చుకున్నాడు. చైనాలోని వూహాన్‌లో పుట్టిన ఈ వైరస్ అక్కడ తక్కువ మరణాలే కానీ.. అమెరికాలో మాత్రం జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. అమెరికాలో ఇప్పటివరకూ 6.44 లక్షల మందికి కరోనా సోకింది. మరోవైపు 28 వేలకు పైగా మృత్యువాత పడ్డారు.
అధికారికంగా చెప్పిన లెక్కల ప్రకారం గంటకు 86మందికి పైగా చనిపోతున్నారు. దీనిపై ఆర్జీవీ కామెంట్ చేస్తూ.. అమెరికాలో సంభవిస్తున్న మరణాలు చూస్తుంటే అక్కడ ప్రతిరోజూ 9/11 దాడులు జరుగుతున్నట్టుగా ఉందనిపిస్తోందన్నాడు. అయితే.. కరోనా మహమ్మారితో పోల్చితే మాత్రం ఒసామా బిన్ లాడెన్ ఓ బచ్చా అని ఆయన వ్యాఖ్యానించాడు. అయినప్పటికీ ఒసామా బిన్ లాడెన్ ఆత్మ పగబట్టి కరోనా వైరస్ రూపంలో అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటోందని మాత్రం తాను భావించనని.. భావించబోనని ఆర్జీవీ ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు. ఈ ట్వీట్‌కు అభిమానులు, నెటిజన్లు చిత్ర విచిత్రాలుగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.