నేచురల్ బ్యూటీ నివేదా పేతురాజ్ అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్‌లో నటించింది అరకొర సినిమాలే అయినా ఈ బ్యూటీకి పిచ్చ ఫాలోయింగ్ ఉంది. సోలోగా అవకాశం రాలేదు కానీ.. వచ్చుంటే మాత్రం తన రేంజ్, తన నటన ఏంటో చూపించేదాన్ని అని ఈ బ్యూటీ తెగ బాధపడుతోంది. ప్రతి సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించాలని అడుగుతండటం.. కాదనలేక వచ్చిందే అవకాశంగా నటించేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ సంక్రాంతికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బన్నీ ‘అల వైకుంఠపురములో..’ సినిమాలో దుమ్ముదులిపేసింది. ఈ యాక్టింగ్‌కు ఇటు బన్నీ.. అటు సుశాంత్.. సినిమా చూసిన ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ సినిమా చూసిన దర్శకనిర్మాతలు ఈ బ్యూటీని మళ్లీ తెలుగులో నటింపజేయాలని భావిస్తున్నారట.
అల్లు అర్జున్, రష్మిక మందన్నా నటీనటులుగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప’ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నివేదాను తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రష్మిక మెయిన్ హీరోయిన్‌గా.. నివేదా ఫ్లాష్ బ్యాక్‌లో హీరోయిన్‌గా తీసుకున్నట్లు లీకులు వస్తున్నాయ్. వాస్తవానికి సెకండ్ హీరోయిన్ ఆలోచన వచ్చినప్పుడే బన్నీనే నివేదా పేరు గుర్తుకు తెచ్చి మరీ ఆమెకు అవకాశం ఇవ్వాలని.. నిజంగా ఆమె నటన సూపర్బ్ సార్ అని కొరటాలకు చెప్పాడట. దీంతో ఇక ఎవర్నో వెతుక్కునేది ఎందుకు..? నివేదానే ఫైనల్ చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట.
అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే పేతురాజ్‌ను బన్నీనే స్వయంగా కాల్ చేసి సంప్రదిస్తానని సుక్కుకు చెప్పాడట. ఫ్లాష్ బ్యాక్ రోల్ కావడం.. ఈ పాత్ర నివేదా అయితే సరిగ్గా సెట్ అవుతుందని చిత్రబృందం భావిస్తోందట. అయితే.. బన్నీ సినిమాలో కాదు.. స్టార్ హీరో సినిమాలోనే సోలోగా నటిస్తోందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అది కోలీవుడ్‌లోనా లేదా టాలీవుడ్‌లోనా అనేది మాత్రం తెలియట్లేదు. ఇందుకు సంబంధించి నిజానిజాలేంటో లెక్కలు తేలాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడక తప్పదు మరి.