ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలోని వూహాన్‌లో పుట్టిన ఈ మహమ్మారి వైరస్ ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. దేశాలు దాటి.. ఖండాలు దాటేసిన ఈ కరోనా.. ఇండియాకు వచ్చేసింది. అంతేకాదు.. తెలుగు రాష్ట్రాల్లోనూ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. మరీ ముఖ్యంగా ఢిల్లీలోని నిజాముద్దీన్ ఘటన తర్వాత పాజిటివ్ కేసుల సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోయింది. బహుశా ఆ ఘటన జరగకపోయుంటే ఈ పాటికే పరిస్థితి అదుపులోకి వచ్చేసేదేమో. వైరస్ ఎటునుంచి.. ఎవరి నుంచి వస్తుందో తెలియని పరిస్థితి. దీంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఈ మహమ్మారి గురించి సెలబ్రిటీ, టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కాసింత కంగారుపడ్డాడు.
నాకే భయమేస్తోంది!
‘పెళ్లిచూపులు సినిమా ముందు కరోనా వైరస్ వచ్చి పరిస్థితులు ఈ రకంగా ఉండుంటే మా ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవడానికి కూడా నాకు భయమేస్తోంది. మా ఫ్యామిలీలో ఎవరూ గవర్న్‌మెంట్ ఎంప్లాయిస్ లేరు.. ఎవరూ వెల్ సెటిల్ కూడా కాదు. అంతేకాదు.. ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టం’ అని విజయ్ తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. కాగా ‘పెళ్లిచూపులు’ సినిమా తర్వాత విజయ్ టాలీవుడ్‌లో కాస్త నిలదొక్కుకొని ‘అర్జున్ రెడ్డి’ మూవీతో స్టార్‌గా నిలిచాడు. అంతేకాదు ఈ రెండు సినిమాల తర్వాత నాలుగు రాళ్లు వెనకేసుకున్నాడు కూడా!. ఇటు సినిమాల్లో.. అటు బిజినెస్‌తో విజయ్.. మూడు పూలు.. ఆరు కాయలుగా లైఫ్ సాగిపోతోంది.
ప్రాణాలకు తెగించి మరీ..
కరోనా మహమ్మారి నివారణకై తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అవగాహన కార్యక్రమాల్లో విజయ్ పాల్గొంటూ వస్తున్నాడు. నిత్యం ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న పోలీసులను ఆయన మెచ్చుకుంటూ.. కృతజ్ఞతలు తెలియజేస్తూ వస్తున్నాడు. గురువారం నాడు హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీసులు సిబ్బందిని విజయ్ కలుసుకుని వారికి కూల్ డ్రింక్స్ అందజేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా పోలీసులకు సహకరించాలని దండం పెట్టి కోరాడు. కరోనాను ఎదుర్కొనే విషయంలో ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా వ్యవహరించినా... మళ్లీ అంతా మొదటికి వస్తుందని అని చెబుతూ దేవరకొండ ఆందోళన వ్యక్తం చేశాడు. మొత్తానికి చూస్తే కరోనా టెన్షన్ విజయ్‌లో చాలానే ఉందని దీన్ని బట్టి తెలుస్తోంది. అలాగని ఎవరిలోనూ టెన్షన్ లేదని కాదు.. విజయ్ ఇలా బయటపడ్డాడంతే.. ఎవరికి భయం వారికి కచ్చితంగా ఉంటుంది.!