మాస్ సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడయిన హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో చేసే సినిమా కోసం స్క్రిప్టు రాసే పనిలో ఉన్నాడు. గబ్బర్ సింగ్ తో ఎప్పటికీ మర్చిపోలేని విజయాన్నందించిన హరీష్ శంకర్.. మరో బ్లాక్ బస్టర్ తీయడానికి సిద్ధం అవుతున్నాడు. లాక్డౌన్ సమయాన్ని స్క్రిప్టు రాయడానికి ఉపయోగించుకుంటూ సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటున్నాడు. మామూలుగా ట్విట్టర్ లో హరీష్ శంకర్ చాలా ఆక్టివ్ గా ఉంటాడు.
ట్విట్టర్ లో ప్రతీ దానికి స్పందిస్తూ విలువైన సమాచారాన్ని అందిస్తుంటాడు. కరోనా కారణంగా రోజువారి సినిమా వర్కర్ల కోసం కరోనా క్రైసిస్ ఛారిటీకి విరాళాలు సేకరిస్తున్న టైమ్ లో హరీష్ శంకర్ నాటకాలు వేసుకునే స్టేజి ఆర్టిస్టులకి అండగా నిలిచాడు. కరోనా మహమ్మారి స్టేజి ఆర్టిస్టుల జీవితాల్లో చీకటి నింపేసింది. ముఖం మీద రంగు వేసుకుంటేనే వారి జీవితాల్లో వెలుగు నిండుతుంది.
అలాంటిది లాక్డౌన్ వల్ల నాటకాలు లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులని ఎదుర్కొంటున్నారు. దీంతో హరీష్ శంకర్ వారికి సాయం చేయడానికి ముందుకు వచ్చాడు. నాటకాలు వేసే ఆర్టిస్టులకి ఈ లాక్డౌన్ సమయంలో కావాల్సిన నిత్యావసర వస్తువులని అందించాడు. ఈ మేరకు 81 బస్తాల్లో నిత్యావసర వస్తువులని వారికి చేరవేసాడు.
మామూలు రోజుల్లోనే వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఇలాంటి టైమ్ లో ఇంకా దయనీయంగా మారడంతో హరీష్ శంకర్ వారికి తోడుగా నిలిచాడు. డైరెక్టర్ అవ్వకముందు హరీష్ శంకర్ నాటకాలు వేసేవాడు. నటుడిగా, దర్శకుడిగా ఎన్నో నాటకాలు వేసి నాటకాల రాయుడు అనిపించుకున్నాడు. అందుకే ఈ కష్టకాలంలో వారికి తోడుగా ఉండి తన బాధ్యతని నెరవేరుస్తున్నాడు.