కోవిడ్ 19 ప్రజల జీవితాల్ని అతలాకుతలం చేసేసింది. ప్రశాంతంగా ఉన్న మన జీవితాల్లోకి చొచ్చుకువచ్చి మనశ్శాంతిని దూరం చేసింది. కరోనా బారి నుండి ప్రజల ప్రాణాలని ఎలా కాపాడాలో తెలియక ప్రభుత్వాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. మనిషిగా మనం చంద్రుడి మీదకి వెళ్లగలిగాం, అంతరిక్షంలో తిరగగలిగాం, సముద్రాల అంతర్భాగంలో ఏముందో తెలుసుకోగలుగుతున్నాం అయినా ఈ వైరస్ ని ఏమీ చేయలేకపోతున్నాం.
కరోనా మీద పోరాటం చేస్తున్న ప్రభుత్వాలకి అండగా నిలవడానికి ఎంతో మంది ముందుకు వస్తున్నారు. సినిమా సెలెబ్రిటీల నుండి రాజకీయ నాయకుల వరకి ప్రతీ ఒక్కరూ తమకి తోచిన సాయం చేస్తున్నారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రధానమంత్రి సహాయ నిధికి 25 కోట్లు విరాళంగా ఇచ్చాడు. షారుక్ ఖాన్ తన సినిమా ఆఫీస్ నే క్వారంటైన్ హోమ్ గా మార్చాడు.
ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా సాయం చేస్తున్నారు. అయితే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ రోజువారి సినీ వర్కర్లని ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు. ఇరవై ఐదు వేల మంది రోజు వారి సినీ వర్కర్ల ఖాతాల్లోకి నెలకి మూడువేల చొప్పున రెండు నెలలు మొత్తం ఆరు వేల ఆర్థిక సాయం అందించాడు. మే 3వరకి లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆ నెలకి సంబంధించిన మూడువేల రూపాయలు కూడా అకౌంట్లలో వేస్తాడట. మొత్తానికి సల్మాన్ ఖాన్ తన ఉదార హృదయాన్ని చాటుకున్నాడు.