బాలకృష్ణ, బి. గోపాల్ కాంబినేషన్ అంటే అప్పట్లో ఎంత క్రేజో! వాళ్ల కలయికలో వచ్చిన తొలి సినిమా ‘లారీ డ్రైవర్’ సూపర్ హిట్టయ్యింది. దాంతో ఆ తర్వాత వచ్చిన ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’ కు ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కు తగ్గట్లుగానే ఈ సినిమా సూపర్ హిట్టయింది. మూడో సినిమాకు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా, సాధారణ ప్రేక్షకులూ తండోపతండాలుగా థియేటర్లకు వచ్చారు. ఫలితం.. ఇండస్ట్రీ హిట్! అంతకుముందు ఇండస్ట్రీ హిట్ అయిన మోహన్‌బాబు మూవీ ‘పెదరాయుడు’ రికార్డుల్ని బద్దలు కొట్టిన ఆ మూవీ.. ‘సమరసింహారెడ్డి’! బాలయ్య, గోపాల్ హ్యాట్రిక్ హిట్ కొట్టడంతో ఆ జోడీకి తిరుగులేదనే అభిప్రాయం, నమ్మకం అందరిలోనూ కలిగాయి. అది వచ్చిన రెండేళ్లకే మళ్లీ కలిసి పనిచేశారు ఆ ఇద్దరూ. ఆకాశాన్నంటిన అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా ‘సమరసింహారెడ్డి’ని మించి హిట్టయి, దాని రికార్డుని బ్రేక్ చేసి, ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అది.. ‘నరసింహనాయుడు’ చిత్రం. దాంతో ఫ్యాన్స్ ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి.
తమ కాంబినేషన్‌కు జనం బ్రహ్మరథం పడుతుండటంతో, మళ్లీ రెండేళ్లకు బాలయ్య, గోపాల్ కలిసి పనిచేశారు. అంతకుముందే తన మూడో ఇండస్ట్రీ హిట్‌ను చిరంజీవితో చేశాడు గోపాల్. ఆ మూవీ.. ‘ఇంద్ర’. దాంతో ‘పలనాటి బ్రహ్మనాయుడు’ సినిమా ఎనౌన్స్‌మెంట్ అయిన దగ్గర్నుంచే దానిపై అంచనాలు ఊహాతీతంగా పెరిగిపోయాయి. ప్రొడ్యూసర్ మేడికొండ మురళీకృష్ణ మంచినీళ్లప్రాయంగా డబ్బులు ఖర్చుపెట్టారు. ‘ఇంద్ర’లో హీరోయిన్లుగా నటించిన ఆర్తీ అగర్వాల్, సోనాలీ బెంద్రే ఇద్దరూ ఈ సినిమాలో నాయికలుగా నటించారు. సినిమా విడుదలైంది. మరో ఇండస్ట్రీ హిట్ ఖాయమని అందరూ ఊహిస్తుంటే, మార్నింగ్ షో నుంచే ఫ్లాప్ టాక్ వచ్చి, డిజాస్టర్‌గా మారింది ‘పలనాటి బ్రహ్మనాయుడు’ మూవీ. నిర్మాత నుంచి బయ్యర్ల దాకా అందర్నీ నిలువునా ఆ సినిమా ముంచేసింది.
అంతే.. అదివరకు నాలుగు సూపర్ హిట్లిచ్చిన బాలయ్య-గోపాల్ జోడీకి ఒక్క డిజాస్టర్ పడగానే బ్యాడ్ నేమ్ వచ్చేసింది. దాంతో ఆ ఇద్దరూ మళ్లీ ఇంతవరకూ కలిసి పనిచెయ్యలేదు. అయినా బాలయ్య అంటే గోపాల్‌కు అభిమానం ఏమాత్రం చెక్కు చెదరలేదు. సందర్భం వచ్చినప్పుడల్లా ఆయన గురించి గొప్పగా చెప్పడం మానలేదు. పదిహేడేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు ఆ ఇద్దరి కాంబినేషన్ మరోసారి వర్కవుట్ కానున్నదనే ప్రచారం జరుగుతోంది. బాలయ్య వందో సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’కి రచన చేసిన సాయిమాధవ్ బుర్రా రాసిన కథ బాలయ్యకు బాగా నచ్చిందనీ, దాన్ని ఆయన గోపాల్ చేతిలో పెట్టాడనీ ఫిల్మ్‌నగర్‌లో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన రావచ్చని కూడా చెప్తున్నారు.
గోపాల్ మెగాఫోన్ చేపట్టి చాలా కాలమే అయ్యింది. గోపీచంద్, నయనతార జోడీగా ఆయన రూపొందించిన మునుపటి సినిమా ‘ఆరడుగుల బుల్లెట్’ విడుదలకు నోచుకోకుండా ఉండిపోయింది. ఈ నేపథ్యంలో బాలయ్యతో సినిమా చెయ్యడం ఆయనకు కత్తిమీద సాము వ్యవహారం కానున్నది. చూద్దాం.. అసలు ఈ కాంబినేషన్ మూవీ మాటల వరకే పరిమితమవుతుందో, నిజంగా పట్టాలెక్కుతుందో!