స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్దే నటీనటులుగా మాటల మాంత్రికుడు తెరకెక్కించిన చిత్రం ‘అల వైకుంఠపురములో..’. ఈ సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అటు సంక్రాంతి విన్నర్.. ఇటు నాన్ ‘బాహుబలి’ రికార్డ్స్‌ను బద్దలు కొట్టేసింది. దీంతో ఈ సినిమాపై బాలీవుడ్ కన్ను పడింది. వాస్తవానికి తెలుగులో హిట్టయిన సినిమాలను రీమేక్ చేయడానికి బాలీవుడ్‌లోని ప్రముఖ దర్శకులు ముఖ్యంగా కరణ్ జోహర్ లాంటి వారు ముందు వరుసలో ఉంటారు. ఇప్పటికే తెలుగులో సూపర్ డూపర్ హిట్టయిన చిత్రాలను రీమేక్ చేసుకొని గట్టిగానే సంపాదించేసుకున్నారు. ‘అల వైకుంఠపురములో..’ సినిమాకు సంబంధించి రీమేక్ రైట్స్‌ను బాలీవుడ్ మేకర్ అశ్విన్ వర్దే కొనేశారని.. అక్షయ్ కుమార్‌ను హీరోగా పెట్టి తెరకెక్కిస్తారని టాక్ నడుస్తోంది. మరోవైపు కండలవీరుడు సల్మాన్ ఖాన్ పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాలంటే లాక్‌డౌన్ ముగిసేదాకా వేచి చూడాల్సిందే.
ఎవరు నటిస్తారో..!?
అయితే.. తాజాగా ఈ సినిమా హక్కులను తమిళ ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ నిర్మాత కూడా కొన్నారని తెలుస్తోంది. రెండ్రోజుల క్రితమే రీమేక్‌కు సంబంధించి మాటలు కూడా అయిపోయాయని.. ఆ నిర్మాత నుంచి గట్టిగానే పుచ్చుకున్నారని సమాచారం. అయితే ఈ సినిమాలో హీరోగా శివకార్తికేయన్‌ను తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు.. ఈ సినిమాను ఎవరు తెరకెక్కిస్తారు..? అల్లు అర్జున్ పాత్రలో ఎవరు..? సుశాంత్ పాత్రలో ఎవరు..? హీరోయిన్స్‌గా ఎవర్ని తీసుకోవాలి..? ఇతర తారాగణంపై ప్రస్తుతం నిర్మాత సెర్చింగ్‌లో ఉన్నాడట. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. లాక్‌డౌన్ అనంతరం ఈ రీమేక్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. నిప్పులేనిదే పొగ రాదన్నట్లుగా పుకార్లే ఊరికే పుట్టవ్. మొత్తానికి చూస్తే బన్నీ ‘అల..’ సినిమా ఇప్పుడు అన్నీ ఇండస్ట్రీలకు గట్టిగా పాకేసిందన్న మాట.