కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కాటేస్తోంది. ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించిన ఈ వైరస్ జనాలను బెంబేలెత్తిస్తోంది. మరీ ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్‌తో పాటు పలు దేశాల్లో రోజుకు వేలాది మంది కుప్పకూలిపోతున్నారు. చనిపోయిన వారి మృతదేహాలను పూడ్చటానికి జనాలు ముందుకు రానిపరిస్థితి. అలాంటి తరుణంలో ఆయా దేశాల్లో మన తెలుగు రాష్ట్రాల ప్రజలు, అక్కడ సెటిల్ అయిన సెలబ్రిటీలు భయంతో వణికిపోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో దక్షిణాది అందాల నటి, ఒకప్పుడు టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన సీనియర్ నటి శ్రియ షాకింగ్ విషయం చెప్పింది.
సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ప్రేమించి పెళ్లాడిన శ్రియ స్పెయిన్‌లోనే భర్త ఆండ్రూ కొచీవ్‌తో కలిసి ఉంటోంది. ఈ మధ్యే కరోనా గురించి వారిద్దరూ సరద సరదాగా మాట్లాడారు కూడా. అయితే సడన్‌గా అభిమానులకు షాక్ గురయ్యే వార్తను చెప్పింది శ్రియ. తన భర్తకు కరోనా లక్షణాలున్నాయని.. పొడి దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాడని చెప్పుకొచ్చింది. అందుకే ముందు జాగ్రత్తగా ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్ అయిపోయి, ప్రత్యేక గదిలో ఉంటున్నాడని తెలిపింది. ఆయన ఓ గదిలో.. తాను ఒక గదిలో ఉంటున్నామని శ్రియ చెప్పింది.
తన భర్తలో ఈ లక్షణాలు కనిపించడంతో ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురయ్యానని.. ఇప్పుడు ఎటువంటి ఇతర అనారోగ్య సమస్యలు లేవని అభిమానులకు ఒకింత శుభవార్త చెప్పింది. ఈ క్రమంలో తాము ఇద్దరం ఆస్పత్రికి వెళ్లగా టెస్ట్‌లు చేసి కరోనా నెగిటివ్ అని రావడంతో వైద్యుల సలహాతో ఇంటికి వచ్చేశామని చెప్పింది. ప్రస్తుతానికి మేమిద్దరమూ స్వీయ నిర్బంధంలో ఉన్నామని శ్రియ తెలిపింది. భౌతిక దూరం పాటిస్తున్నామని.. దేవుడి దయవల్ల ప్రస్తుతం ఆండ్రూ ఆరోగ్యంగానే ఉన్నాడని శ్రియ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది.