నాలుగంటే నాలుగేళ్లలో అను ఇమ్మాన్యుయేల్ ఫేట్ మారిపోయింది. నాని సినిమా ‘మజ్ను’ (2016)లో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమైన ఈ కేరళ కుట్టి కెరీర్ ఆశించిన రీతిలో ముందుకు సాగడం లేదు. ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్, అజ్ఞాతవాసి, నా పేరు సూర్య, శైలజారెడ్డి అల్లుడు’ సినిమాల్లో హీరోయిన్‌గానో, సెకండ్ హీరోయిన్‌గానో చేసింది అను. నాగచైతన్య జోడీగా చేసిన ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో హీరోయిన్‌గా మరో అవకాశం రాలేదు. తమిళంలో గత ఏడాది శివ కార్తికేయన్‌తో చేసిన ‘నమ్మవీటు పిళ్లై’ తర్వాత అక్కడా మళ్లీ ఇంతదాకా మరో సినిమా చేయలేదు.
అలాంటిది ఇప్పుడు ఆమె ఒక తెలుగు సినిమాలో విలన్ భార్యగా నటించిందని తెలుస్తోంది. అది.. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ రూపొందిస్తోన్న ‘అల్లుడు అదుర్స్’ మూవీ. అందులో సోనూ సూద్ విలన్‌గా నటిస్తున్నాడు. అతనికి భార్య క్యారెక్టర్‌ను అను చేసిందని సమాచారం. సంతోష్ శ్రీనివాస్ ఇదివరకు డైరెక్ట్ చేసిన ‘కందిరీగ’ మూవీలో రామ్ హీరో కాగా, సోనూ సూద్ విలన్. అందులో హన్సిక, అక్ష హీరోయిన్లుగా నటిస్తున్నారని మొదట్లో చెప్పారు. తీరా సినిమా విడుదలయ్యాక చూస్తే సోనూ సూద్ జోడీగా అక్ష కనిపించింది.
ఇప్పుడు ‘అల్లుడు అదుర్స్’ మూవీలో నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారని చిత్ర బృందం ప్రకటించింది. అయితే ‘కందిరీగ’ తరహాలోనే ఈ సినిమాలో సోనూ జోడీగా అను కనిపిస్తుందని ప్రచారం జరుగుతోంది. కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా థియేటర్ల మూసివేత లేనట్లయితే ఏప్రిల్ 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. ఇప్పుడు అనివార్యంగా విడుదల తేదీ వాయిదా పడింది. మొత్తానికి సినిమా రిలీజైతే కానీ, అను విషయంలో జరుగుతున్న ప్రచారం నిజమో, కాదో తెలియదు.