కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఎప్పుడు వదిలిపెడుతుందో తెలియని ఈ మహమ్మారిపై పోరాటం జరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఒక్కరి మీద మహమ్మారి ప్రభావం పడింది. చైనా నుండి మొదలుకుని, ఇటలీ, స్పెయిన్, అమెరికా తదితర దేశాల్లో దీని ప్రభావం మరీ ఎక్కువగా ఉంది. భారతదేశం సహా చాలా దేశాలు ఈ వైరస్ బారిన పడకుండా ఉండడానికి లాక్డౌన్ నే ఆయుధంగా వాడుతున్నాయి.
అయితే లాక్డౌన్ కారణంగా సినిమా థియేటర్లు మూతబడిపోయాయి. దీంతో సినిమా రంగం మీద బాగా దెబ్బ పడింది. రోజు రోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్న దాన్ని బట్టి చూస్తుంటే లాక్డౌన్ ఇప్పట్లో ఎత్తేసే అవకాశాలు కనిపించట్లేదు. ఒకవేల లాక్డౌన్ ఎత్తేసిన కూడా జనాలు థియేటర్లకి వచ్చే అవకాశం కనిపించట్లేదు. సినిమా థియేటర్లలో సామాజిక దూరం పాటించేలా ఒక సీటు వదిలి మరో సీటులో కూర్చునేలా ఏర్పాటు చేస్తారని వార్తలు వస్తున్నా కూడా టికెట్ కి రెండు మూడు వందలు పెట్టి సినిమా చూడడం కష్టమే అని అంటున్నారు.
పనులేమీ లేక ఆదాయం పూర్తిగా తగ్గిపోవడంతో సినిమా చూసేందుకు అంత డబ్బు పెట్టి రావడం కష్టమే. కాబట్టి సినిమా చూడడానికి థియేటర్లకి రావాలంటే టికెట్ రేట్లు తగ్గించాల్సిందే. లేదు తగ్గించము.. అలాగే ఉంటాయి అంటే వారి సినిమా వారే చూసుకోవాల్సి వస్తుందని అంటున్నారు. అప్పు కట్టడానికి ముఖ్యమంత్రులే ఆరునెలలు టైమ్ అడుగుతుంటే సినిమా చూడడానికి ప్రేక్షకులు టికెట్ ధర తగ్గించమనడం కరెక్టే కదా..