రాజమౌళి సినిమాలు చాలా సుధీర్ఘంగా ఉంటాయి. వాటిని తెరకెక్కించడానికి చాలా సమయం తీసుకుంటాడు. అనుకున్న సమయానికి రిలీజ్ చేసినట్లు రాజమౌళి చరిత్రలోనే లేదంటే అతిశయోక్తి కాదేమో. బాహుబలి కోసం ఐదేళ్ల సమయాన్ని తీసుకున్న రాజమౌళి, తర్వాతి చిత్రం ఆర్ ఆర్ ఆర్ కోసం కూడా చాలా టైమ్ తీసుకుంటున్నాడు. నిజానికి ఈ సంవత్సరం జులైలో విడుదల కావాల్సింది సంక్రాంతికి వెళ్ళింది.
కానీ మనం ఒకటి అనుకుంటే దైవం ఒకటి తలుస్తాడని చెప్తారు. ప్రస్తుతం అదే జరుగుతుంది. కరోనా కారణంగా షూటింగులన్నీ ఆగిపోవడంతో ఆర్ ఆర్ ఆర్ విడుదల మళ్లీ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. హాలీవుడ్ నటులతో పాటు, గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువ ఉన్నందున జనవరిలో విడుదల చేయడం కష్టం అని అంటున్నారు. అందువల్ల వేసవి టార్గెట్ గా సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
మూడేళ్ల క్రితం బాహుబలి 2 విడుదలైన రోజున అంటే ఏప్రిల్ 28వ తేదీనే ఆర్ ఆర్ ఆర్ ని విడుదల చేయాలని భావిస్తున్నారని సమాచారం. ఆ తేదీన రిలీజైన బాహుబలి 2 ఎంత బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. బాహుబలి సెంటిమెంట్ తో, ఆ తేదీనే రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఈ విషయమై మరికొద్ది రోజుల్లో అధికారిక సమాచారం రానుందని చెబుతున్నారు.