కన్నడ సినిమా కిరాక్ పార్టీ తో ఫేమస్ అయిన రష్మిక మందన్న తెలుగులో నాగశౌర్య సరసన ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా విజయంతో ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటించిన గీత గోవిందం సినిమాతో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోల సరసన చేయడానికి పూజాహెగ్డే తర్వాత ఏకైక ఆప్షన్ గా మారింది. ఇటు తెలుగులో బిజీగా ఉంటూనే కన్నడ చిత్రాల్లో కూడా నటిస్తుంది.
తాజాగా రష్మిక నటించిన కన్నడ సినిమా పాటపై మహిళా సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ధృవ సార్ణ హీరోగా నటించిన పొగరు చిత్రంలో హీరోయిన్ గా రష్మిక నటించింది. కరోనా కారణంగా విడుదల వాయిదా పడ్డ ఈ చిత్రం నుండి ఒక వీడియో సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ లో రష్మిక వెంటపడుతూ హీరో ధృవ సార్ణ కనిపిస్తాడు. అలా వెంటపడడమే ఇప్పుడు వివాదానికి దారి తీసింది.
సాధారణంగా సినిమాల్లో హీరోయిన్ల వెంట హీరోలు పడటం కామనే. కానీ ఈ పాటలో టీజింగ్ మరో శృతి మించినట్లుగా ఉండడంతో మహిళా సంఘాలు అభ్యంతరాలు పెడుతున్నాయి. మహిళలని కించపరిచినట్లుగా చిన్నచూపు చూస్తున్నట్లుగా ఉండడంతో, ఆ పాటని యూట్యూబ్ నుండే కాక, సినిమా నుండి తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు.