కోవిడ్ 19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఒక్కరి జీవితం అస్తవ్యస్థంగా తయారైంది. వైరస్ ప్రభావం వలన ఆర్థికంగా నష్టాలు వస్తున్నా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. కరోనాపై పోరాటం చేయడానికి అసలైన ఆయుధం ఇళ్ళలో నుండి బయటకి రాకపోవడమే అని చెప్పడంతో ప్రతీ ఒక్కరూ ఎవరిళ్లలో వారు ఉండిపోతున్నారు. అందరూ ఇళ్లకే పరిమితం కావడంతో రోజువారి కూలీల పరిస్థితి దారుణంగా తయారైంది.
అయితే సినిమా రంగం మీద ఆధారపడే రోజువారి వర్కర్ల అవస్థలు తీర్చడానికి మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో కరోనా క్రైసిస్ ఛారిటీ స్థాపించి విరాళాలు సేకరిస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలోని పెద్ద పెద్ద హీరోల నుండి చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు తమకి తోచిన సాయం అందిస్తున్నారు. ఇప్పటికే సమకూరిన డబ్బుతో వారి ఆకలి తీర్చే పనులు స్టార్ట్ అయ్యాయి. చిరంజీవి ఈ ఛారిటీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.
అందరికీ ఫోన్లు చేసి కష్టకాలంలో అండగా నిలుద్దాం అని పిలుపునిస్తున్నాడు. తాజాగా కొరటాల శివ కరోనా క్రైసిస్ ఛారిటీకి 5 లక్షలు ప్రకటించాడు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తెలియజేసిన కొరటాల.. ఇది సాయం కాదని, కష్టకాలంలో తోడుగా ఉండడం అని చెప్పాడు. సినిమా కోసం పనిచేసే వాళ్ల కోసం సినిమా వాళ్ళు ముందుకు రావడం, తోడుగా ఉన్నట్టు భరోసా ఇవ్వడం సినిమా వాళ్లకే మంచిది.