టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎప్పుడైతే సోషల్ మీడియాలో అడుగుపెట్టారో ఆ వార్తలు ఇంకా పెరిగిపోయాయ్. అయితే.. ఈ సోషల్ మీడియా, కరోనా లాక్‌డౌన్ పుణ్యమా అని మెగాభిమానుల సందేహాలకు మాత్రం కొన్ని సమాధానాలు దొరుకుతుండటంతో వాళ్లు హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. చిరు రాజకీయాల్లో ఉన్నా.. సినిమాల్లో ఉన్నా వార్తలు మాత్రం గట్టిగానే వస్తాయ్.. ఇందులో ఎటువంటి సందేహాల్లేవ్. అయితే వీటికంటే ఎక్కువగానే పుకార్లు మాత్రం ఎక్కువగానే షికార్లు చేస్తుంటాయ్.
పుకార్లు ఇవీ..
ముఖ్యంగా చిరు-అల్లు అరవింద్ మధ్య అసలేం జరిగింది..? ఎందుకు వాళ్లిద్దరూ ఎడ మొహం.. పెడ మొహం అన్నట్లుగా ఉన్నారు..? వారిద్దరికీ మధ్య చెడిందా..? చిరు రీ ఎంట్రీతో గీతా ఆర్ట్స్‌కు ఎందుకు చాన్స్ ఇవ్వలేదు..? చెర్రీ సొంత బ్యానర్‌పైనే ఎందుకు చేశాడు..?. మరోవైపు పవన్ కల్యాణ్‌కు చిరు మధ్య ఏం జరిగింది..? పవన్ పెట్టిన పార్టీని చిరు ఎందుకు పట్టించుకోవట్లేదు..? ఇద్దరి మధ్యా మనస్పర్థలు వచ్చాయా..? ఇలా చాలానే ప్రశ్నలు వచ్చాయ్. వీటిపై ఇంతవరకూ ఎక్కడా అటు చిరు కానీ.. ఇటు అరవింద్ కానీ.. పవన్ కానీ రియాక్ట్ అవ్వకపోవడంతో.. మెగాభిమానులు మాత్రం అసలేం జరిగిందో అని వారి మనసుల్లో ప్రశ్నలు అలానే ఉండిపోయాయ్.
చిరు క్లారిటీ ఇదీ..
తాజాగా ఓ ఇంటర్వ్యూ వేదికగా అసలేం జరిగిందో చిరు స్వయంగా చెప్పారు. ‘అల్లు అరవింద్‌కు నాకు ఎలాంటి గొడవల్లేవ్. వార్తలన్నీ పుకార్లే. ఆయన మా కుటుంబ సభ్యుడు. మేమిద్దరం ఏ విషయం అయినా చర్చించుకుంటూ ఉంటాం. ఇద్దరం కూడా ఒకరి సలహాలు ఒకరం తీసుకుంటాం. మరీ ముఖ్యమైన విషయాలను కలిసి కూర్చొని చర్చించుకుంటాం. మా మధ్య విభేదాలు ఉన్నాయనడంలో ఏ మాత్రం నిజం లేదు.. విభేదాలున్నట్లు వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలే. ఇక తమ్ముడు విషయానికొస్తే.. గతంలో తమ్ముడు పవన్ తోనూ విభేదాలు ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. అసలు ఇలాంటి ఆరోపణలు ఎవరు చేస్తున్నారో..? ఎందుకు చేస్తున్నారో..? అనేది నాకు అస్సలు అర్థం కావట్లేదు. వాస్తవానికి ఇలాంటి పుకార్లను నేను పెద్ద పట్టించుకోను.. అందుకే రియాక్ట్ అవ్వను’ అని మెగాస్టార్ తేల్చేశారు. మొత్తానికి చూస్తే ఎన్నో ఏళ్లుగా మెగాభిమానులు, ఔత్సాహికుల్లో నెలకొన్న ప్రశ్నలకు చిరు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారన్న మాట. సో.. ఇకనైనా అలా పుకార్లు రాసే వారు ఆపుతారో.. మరింత డోస్ పెంచి రాస్తారో వేచి చూడాలి.