టైటిల్ చూడగానే ఇదేంటి.. అవునా నిజమా..? ఎందుకనీ.. నిజంగానే కాల్ చేసి మెగాస్టార్ వార్నింగ్ ఇచ్చారా..? ఏ విషయంలో వార్నింగ్ ఇచ్చారు..? సినిమా విషయంలోనా ..? లేదా సాయం విషయంలోనా..? అనే సందేహాలు కలుగుతున్నాయ్ కదూ.. అవును ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్ అయ్యింది. ఇందులో నిజానిజాలెంతో తెలియరాలేదు కానీ.. ప్రముఖ వెబ్ సైట్స్ మాత్రం కథనాలు తెగ రాసేస్తున్నాయ్. ఇంతకీ అసలు కథేంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
ఇప్పటికే చాలా మంది..
కష్టం వచ్చినప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీ ఎప్పుడూ చేదోడు వాదోడుగా ఉంటుంది. మాట సాయమే కాదు.. చేతల రూపంలోనూ డబ్బులిచ్చి సాయం చేస్తూ మంచి మనసు చాటుకుంటూ ఉంటుంది టాలీవుడ్. అంతేకాదు.. తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న కొన్ని విపత్కర సమయాల్లో విరాళాలు కోసం వినూత్నంగా పోటీలు, ప్రత్యేకంగా షోలు నడిపి మరీ ఆదుకున్నారు. ఇందుకు ఉదాహరణలు చాలానే ఉన్నాయ్. ప్రస్తుతం కరోనాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోరాడుతున్నాయి. లాక్‌డౌన్‌తో సినిమా షూటింగ్‌లు, రిలీజ్‌లు సర్వం బంద్ అయ్యాయి. దీంతో సినీ కార్మికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో టాలీవుడ్ వారిని అక్కున చేర్చుకోవడానికి చారిటీని ఏర్పాటు చేసి విరాళాలు సేకరించి వారిని ఆదుకుంటోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు, నటీనటులు తమ వంతుగా విరాళాలు ప్రకటించారు. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సైతం తమకు తోచినంత సాయం చేశారు.
సోషల్ మీడియాలో కాదు.. !?
ఈ విషయంలో టాలీవుడ్‌కు చెందిన హీరోయిన్స్ మాత్రం చాలా వెనుబడి ఉన్నారనే చెప్పుకోవాలి. ఒకరిద్దరు తప్ప ఎవరూ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. తాము నటించిన సినిమాలు చూసి ఈ రేంజ్‌కు తీసుకొచ్చిన, స్టార్ హీరోయిన్లుగా చేసిన అభిమానులు, తెలుగు రాష్ట్రాల ప్రజలను నటీమణులు మరిచిపోయారు. ఎవరికివారుగా లాక్‌డౌన్‌తో ఎంచక్కా ఇంట్లో ఉంటూ.. సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కరోనా సాయం విషయంపై స్పందించకుండా మిగతా అన్ని విషయాలపైనా తెగ మాట్లాడేస్తున్నారు. దీంతో ఇప్పటికే ఫుల్ ఫ్రస్టేషన్, ఆగ్రహానికి లోనైన సీనియర్ నటుడు బ్రహ్మాజీ రియాక్ట్ అవుతూ.. స్పందించి విరాళాలు ప్రకటించాలని కన్నెర్రజేశాడు.
చిరు స్వీట్ వార్నింగ్..!
అయితే.. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా కొందరు స్టార్ హీరోయిన్స్‌కు కాల్ చేసి.. ‘ఏమైందమ్మా రియాక్ట్ అవ్వరేం.. మనల్ని ఈ స్థాయికి తెచ్చిన అభిమానులు, ప్రేక్షకులు.. మరీ ముఖ్యంగా సినీ కార్మికులను మరిచిపోతే ఎలా..?. వాళ్లు కష్టాల్లో ఉన్నారు.. వారి కోసం మన వంతుగా సాయం చేయాల్సిన టైమ్ వచ్చింది. మీ వంతుగా ఇవ్వండమ్మా.. దీనికి మీరు ఫీల్ అవ్వనక్కర్లేదు.. బాధ్యత అని మాత్రం మర్చిపోకండి’ అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారట. దీనికి సంబంధించి టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. మరోవైపు ప్రముఖ వెబ్ సైట్స్ పెద్ద ఎత్తున కథనాలు రాసేస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే.. చిరు అలా అడగటంలో కూడా ఏ మాత్రం తప్పులేదని విశ్లేషకులు, క్రిటిక్స్ చెబుతున్నారు. కాగా.. టాలీవుడ్‌కు ఇప్పుడు అన్నీ తానై చిరు ‘పెద్దన్న’ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.