స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బన్నీ, పూజా హెగ్దే నటీనటులుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రం ‘అల వైకుంఠపురములో..’. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అంతేకాదు.. బన్నీ కెరియర్‌లోనే అత్యధిక కలెక్షన్లు దక్కించుకున్న సినిమాగా నిలిచిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా బన్నీ సినీ కెరీర్‌కు ఓ మైల్ స్టోన్. అయితే.. అప్పుడెప్పుడో సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ చిత్రం ఇంకా రికార్డ్‌లు బ్రేక్ చేస్తూనే ఉంది. ఈ సినిమాకు పోటీగా సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సైతం కలెక్షన్ల పరంగా బన్నీ చిత్రానికి ఏ మాత్రం తగ్గలేదు. అలా ఇద్దరూ ఇద్దరే.
ఇక్కడ మహేశ్..
థియేటర్లలో కలెక్షన్లు, బాక్సాఫీస్‌ను షేక్ చేయడాలు అటుంచితే.. ఇప్పుడు కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ నడస్తుండటంతో ఈ రెండు సినిమాలను జనాలు మరోసారి హిట్ చేసేస్తున్నారు. అదెలాగంటే టీవీల్లో జనాలు తెగ చూసేస్తున్నారు. ఉగాది పర్వదినాన టెలివిజన్ ప్రీమియర్‌గా మార్చి 25న జెమినీ టీవీలో టెలికాస్ట్ చేయగా మంచి టీఆర్పీని సొంతం చేసుకుని సంచలన రికార్డ్‌ను నమోదు చేసుకుంది. ఇప్పటివరకూ 22.70 టీఆర్పీతో ‘బాహుబలి-2’ అగ్ర స్థానంలో ఉండగా.. తాజాగా మహేశ్ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం 23.4 టీఆర్పీని సాధించింది. కాగా.. మొదట బాహుబలి-01 రికార్డ్‌ను ‘బాహుబలి-2 బద్ధలు కొట్టగా.. ఆ రెండు రికార్డ్స్‌ను తిరగరాసి ‘సరిలేరు నాకెవ్వరు’ అని మహేశ్ అనిపించుకున్నాడన్న మాట.
అక్కడ బన్నీ..
ఇక బన్నీ విషయానికొస్తే.. తెలుగులో కాదులే కానీ మలయాళంలో మాత్రం మరోసారి ‘మల్లు అర్జున్’ అనిపించుకున్నాడు. ‘అంగు వైకుంఠపురతు’ అనే పేరుతో సూర్య టెలివిజన్‌లో టెలికాస్ట్ అయ్యింది. అయితే ఈ సినిమాను రికార్డు స్థాయిలో జనాలు చూడటంతో టీఆర్పీ రేటింగ్ భారీగానే వచ్చింది. దీంతో అటు మలయాళ.. ఇటు తెలుగులోని బన్నీ అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయ్. కాగా.. ఈ సినిమాకు 11.7 టీఆర్పీ రేటింగ్‌ను సాధించడం మలయాళంలో ఓ రికార్డు అని అక్కడి విశ్లేషకులు, క్రిటిక్స్ చెబుతున్నారు. మొత్తానికి చూస్తే బన్నీ రేంజ్ మరోసారి తెలిసిందన్న మాట. ఇదిలా ఉంటే.. మలయాళంలో ఈ చిత్రం రూ.1.17 కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించిన విషయం విదితమే.
సీఎం ప్రశంసలు..
ఇదిలా ఉంటే.. బన్నీపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రశంసల వర్షం కురిపించారు. కరోనా కట్టడిలో భాగంగా తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళకు సైతం బన్నీ విరాళాలు ప్రకటించిన విషయం విదితమే. దీనిపై తాజాగా సీఎం స్పందించారు. ‘ఈ సహాయంతో కేరళ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమ రాష్ట్రాన్ని కూడా ఆదుకోవాలన్న బన్నీ ఆలోచన చాలా గొప్పది. ఈ ఆపత్కాలంలో అల్లు అర్జున్ చేసిన ఈ సాయాన్ని కేరళ ప్రజలు ఏనాటికీ మరచిపోరు’ అని సీఎం ప్రశంసించారు. కాగా.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి చెరో 50 లక్షల రూపాయలు విరాళం అందించడంతో పాటు కేరళ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కి మరో 25 లక్షల రూపాయలు అందించారు. అలా మొత్తంగా రూ. 1 కోటి 25 లక్షలు విరాళం ప్రకటించిన విషయం విదితమే.