ఇవాళ టాలీవుడ్‌లో నంబర్ వన్ హీరోయిన్ అంటే ఎవరైనా ఠక్కున చెప్పే పేరు పూజా హెగ్డే. ‘అల వైకుంఠపురములో’ మూవీతో ఆమె ఇమేజ్ అమాంతం అనేక రెట్లు పెరిగిపోయింది. తన కెరీర్‌లోనే అత్యుత్తమ స్థాయిలో ఉంది పూజ. ‘అరవింద సమేత’తో మొదలుపెట్టి.. మహర్షి, గద్దలకొండ గణేష్, హౌస్‌ఫుల్ 4 (హిందీ), అల వైకుంఠపురములో మూవీలతో వరుస హిట్లు సాధించింది. చివరి సినిమాలో ఆమె సౌందర్యాన్ని కీర్తిస్తూ ఏకంగా రెండు పాటలే ఉన్నాయి. ‘సామజవరగమన’ అంటూ సీతారామశాస్త్రి రాసిన పాట, ‘బుట్టబొమ్మ’ అంటూ రామజోగయ్యశాస్త్రి రాసిన పాట రెండూ అమితంగా ఆకట్టుకున్నాయి.
అందుకే ఇవాళ స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు తమ సినిమాల్లో నాయికగా పూజను కోరుకుంటున్నారు. దీంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి. తనకు వచ్చిన ఈ స్టార్ స్టేటస్‌ను సాధ్యమైనంత వరకు ఉపయోగించుకోవాలని ఆమె భావిస్తోంది. ఆమధ్య మీడియాతో జరిపిన ఒక సంభాషణలో ‘‘టాప్‌లో ఉండాలని కోరుకుంటాను. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో నేనున్న స్థాయిని ఆస్వాదిస్తున్నా. నంబర్ వన్ హీరోయిన్ అనిపించుకోవడాన్ని ఇష్టపడతాను. బాలీవుడ్‌లోనూ ఇలాంటి స్థాయినే సాధించాలని ఆశిస్తున్నా’’ అని చెప్పింది పూజ.
ప్రస్తుతం తెలుగులో ఆమె రెండు సినిమాలు చేస్తోంది. ఒకటి.. అఖిల్ జోడీగా నటిస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, రెండోది.. ప్రభాస్ సరసన చేస్తోన్న ‘ఓ డియర్’ (పరిశీలనలో ఉన్న టైటిల్). ఈ రెండూ లవ్ స్టోరీలే కావడం గమనార్హం. ఇప్పటివరకూ మూడు సినిమాలు చేసినా ఒక్క సక్సెస్సూ సాధించలేకపోయిన అఖిల్‌కు నాలుగో సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సక్సెస్‌ను ఇచ్చినట్లయితే, ఆ క్రెడిట్‌లో పూజకూ భాగముందనే పేరు రావడం ఖాయం. మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో తొలిసారి జట్టు కడుతుండటంతో, ఆ జంటను తెరపై చూడాలని ఫ్యాన్స్ తహతహ లాడుతున్నారు. ఆ ఇద్దరి కెమిస్ట్రీ ఎలా ఉంటుందోననే ఆసక్తి అందరిలోనూ వ్యక్తమవుతోంది.
పరిస్థితులు సాధారణంగా ఉన్నట్లయితే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఈ నెలలోనే విడుదలై ఉండేది. కరోనా ప్రభావంతో అనివార్యంగా ఆ సినిమా విడుదల వాయిదా పడింది. ఇక ప్రభాస్‌తో పూజ చేస్తోన్న మూవీ లెక్క ప్రకారం దసరా లేదా క్రిస్మస్‌కు రావాలి. అదిప్పుడు 2021 వేసవికి మారిందని తెలుస్తోంది. మరోవైపు బాలీవుడ్‌లోనూ ఓ క్రేజీ సినిమాలో హీరోయిన్‌గా చాన్స్ దక్కించుకుంది పూజ. అది, సల్మాన్‌ఖాన్ సినిమా ‘కభీ ఈద్ కభీ దీవాళీ’. ఇలా ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ పొజిషన్ ఎంజాయ్ చేస్తూ, బాలీవుడ్‌లోనూ పాగా వెయ్యాలని కృషి చేస్తోంది పూజ.