అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న మూడవ చిత్రం పుష్ప లుక్ వచ్చేసింది. ఆర్య, ఆర్య 2 తర్వాత బన్నీ, సుకుమార్ దర్శకత్వంలో మళ్ళీ చేస్తున్నాడు. బన్నీ పుట్టినరోజుని పురస్కరించుకుని విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి విశేష స్పందన లభించింది. యూట్యూబ్ లో వేలల్లో లైక్స్ వచ్చాయి. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా ఫస్ట్ లుక్ కి రానటువంటి లైక్స్ రావడంతో చిత్ర బృందం హ్యాపీగా ఉంది.
అయితే బన్నీ పుష్ప లుక్ చూసిన తర్వాత మహేష్ అభిమానుల్లో ఆశ కలిగింది. తమ హీరోని కూడా అలాంటి డిఫరెంట్ గెటప్ లో చూడాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ఇప్పటి వరకు మహేష్ చేసిన సినిమాలన్నింటిలో దాదాపుగా ఒకే లుక్ ఉంటుంది. సినిమా వచ్చిన ప్రతీ సారి కొత్తగా కనిపిస్తానని చెప్తాడు. తీరా వెళ్ళి చూస్తే ఎప్పటిలాగే ఉంటుంది. ఇతర హీరోలు సినిమా సినిమాకి కొత్త కొత్త గెటప్పుల్లో కనిపించి అభిమానులకి ఆనందం పంచుతుంటే మహేష్ మాత్రం కొత్తగా ట్రై చేయకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
అయితే ఈ సారి మహేష్ అభిమానులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. తమ హీరోని వివిధ గెటప్పుల్లో చూడాలని ఆశపడుతున్నారు. డిఫరెంట్ గా కనిపించడంలో మా హీరో ఏమాత్రం తక్కువ కాదని చెప్పాలనుకుంటున్నారు. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్న మహేష్, ఈ సారైనా అభిమానుల ఆశలని నెరవేరుస్తాడా లేదా చూడాలి.