అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప చిత్ర టైటిల్ లోగోని బన్నీ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. పుష్ప అనే ఆడవాళ్ల పేరుని సినిమాకి పెట్టడం కొంత విచిత్రంగా అనిపించినా కొత్తగా ఉంది. అయితే ఈ టైటిల్ లో మనం గమనించని చాలా డీటైల్స్ ఉన్నాయి. సెకండ్ లుక్ లో బన్నీ ఎడమకాలుకి ఉన్న ఆరువేళ్ల గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది.
ఇక మరో అంశం, టైటిల్ లోగోలో కనిపిస్తున్న ముద్రల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అవి వేలిముద్రల్లాగా ఉండడంతో....వాటికి సినిమాకి ఏదో సంబంధం ఉందని అనుకుంటున్నారు. అయితే అందరూ అనుకుంటున్నట్టు అవి వేలిముద్రలు కావట. పెద్ద పెద్ద వృక్షాలని మొదళ్ళకి నరికేస్తే మిగిలిపోయిన భాగం మీద కొన్ని వలయాలు కనిపిస్తాయి. ఆ వలయాల ఆధారంగా వృక్షాల వయస్సుని లెక్కగడతారు.
పుష్ప టైటిల్ లోగోలో కనిపించే ఆ ముద్రలు చెట్టు యొక్క వలయాలని చెబుతున్నారు. జాగ్రత్తగా గమనిస్తే అది నిజమే అనిపిస్తుంది. ఎర్రచందనం స్మగింగ్ నేపథ్యంలో సాగే కథ కాబట్టి సింబాలిక్ గా ఆ వలయాలని టైటిల్ లో పెట్టారట. టైటిల్ పోస్టర్ లోనే ఇన్ని ఆసక్తికరమైన అంశాలను పొందుపర్చిన సుకుమార్, సినిమా పట్ల ఆసక్తిని మరింత పెంచాడు.