లాక్‌డౌన్ నేపథ్యంలో నాచురల్ స్టార్ నాని ఇంట్లో తీరిగ్గా కొడుకు జున్నుతో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు. కరోనా గొడవ లేకుండా ఉన్నట్లయితే ఈపాటికే విలన్‌గా ‘వి’ మూవీతో మన ముందుకు వచ్చేసి, నటుడిగా తనలోని మరో కోణాన్ని మనకు చూపించి ఉండేవాడే. మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్ట్ చేసిన ఆ సినిమాని ఉగాది సందర్భంగా మార్చి 25న విడుదల చేయడానికి దిల్ రాజు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. కరోనా గొడవతో థియేటర్లు మూసేయడంతో విడుదలను వాయిదా వేయక తప్పలేదు. సుధీర్‌బాబు హీరోగా నటించిన ఈ సినిమాలో నివేదా థామస్, అదితి రావ్ హైదరి హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీలో సీరియల్ కిల్లర్‌గా నాని మనకు కనిపించనున్నాడు. ఇప్పటికే ట్రైలర్‌తో అతను మనలో ఆసక్తిని బాగా పెంచేశాడు. లాక్‌డౌన్ రోజులు ముగిసి, థియేటర్లు తెరుచుకున్నాక ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. జూన్‌లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయనేది దిల్ రాజు క్యాంపస్ నుంచి వినవస్తోన్న మాట.
‘వి’ సినిమాతో పాటు ఎఫెక్ట్ అయిన నాని మరో సినిమా ‘టక్ జగదీష్’. ‘నిన్నుకోరి, మజిలీ’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలు రూపొందించిన శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫిబ్రవరిలో పొల్లాచ్చిలో సెట్స్‌పైకి వెళ్లింది. ‘పెళ్లిచూపులు’ హీరోయిన్ రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్ నాయికలుగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఓ షెడ్యూల్ తర్వాత ఆగిపోయింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ మూవీని జూలైలో తీసుకురావాలని నిర్మాతలు అనుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా విడుదల అక్టోబర్‌కు వెళ్లే అవకాశాలు ఎక్కువ.
గమనించాల్సిన విషయమేమంటే ‘వి’, ‘టక్ జగదీష్’ సినిమాలు రెండూ నానికి కలిసొచ్చిన దర్శకులు తీస్తున్నవే. నానిని ‘అష్టా చమ్మా’తో హీరోగా పరిచయం చేసింది మోహనకృష్ణ అనే విషయం తెలిసిందే. ఆ సినిమా హిట్టు. ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘జెంటిల్‌మన్’ సినిమా మరింత పెద్ద హిట్టు. ఇక శివనిర్వాణ డైరెక్టర్‌గా పరిచయమైంది నాని హీరోగా నటించిన ‘నిన్నుకోరి’ సినిమాతోటే. అది ప్రేక్షకుల్ని బాగా అలరించింది. అలా తనకు కలిసొచ్చిన దర్శకులతో నాని పనిచేస్తున్న రెండు సినిమాలు ఇప్పుడు కొత్త విడుదల తేదీలను వెతుక్కుంటుండటం గమనించాల్సిన విషయం.