ఏ దర్శకుడికైనా స్టార్ హీరోతో సినిమా చేయాలని ఉంటుంది. మొదటగా చిన్న హీరోల సినిమాలకి దర్శకత్వం వహించినా, వారి గమ్యం స్టార్ హీరోతో సినిమా అయి ఉంటుంది. స్టార్ హీరోలతో సినిమా చేస్తే వచ్చే పేరు, డబ్బేకాకుండా సినిమాని తాము అనుకున్నట్లుగా ఎలాంటి బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ లేకుండా తీయగలుగుతారు. కాబట్టి దర్శకులంతా స్టార్ హీరోలకై చూస్తుంటారు.
అయితే వంశీపైడిపల్లి అదృష్టం ఏంటోగానీ మొదటి సినిమాకే ప్రభాస్ తో చేసే అవకాశం వచ్చింది. మున్నా సినిమా టైమ్ కి ప్రభాస్ కి ఇప్పుడున్నంత రేంజ్ లేకపోయినా స్టార్ ట్యాగ్ వచ్చేసింది. మొదటి సినిమా ప్రభాస్ తో చేసి, రెండో సినిమాకి జూనియర్ ఎన్టీఆర్ ని పట్టేశాడు. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఎవడు, నాగార్జునతో ఊపిరి, మహేష్ బాబుతో మహర్షి సినిమాలు తీశాడు.
మహర్షి తర్వాత మళ్ళీ మహేష్ ని డైరెక్ట్ చేస్తానని అనుకున్నాడు. కానీ ఒక్కసారిగా కథంతా రివర్స్ తిరిగింది. వంశీ చెప్పిన కథ మహేష్ కి నచ్చకపోవడంతో మహేష్ మరో దర్శకుడితో వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు వంశీతో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు ఎవరూ సిద్ధంగా లేరు. అందరూ వారి వారి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.
రామ్ చరణ్ వంశీతో చేయడానికి సుముఖత చూపుతున్నట్లు వార్తలొస్తున్నా, ఆర్ ఆర్ ఆర్ తో బిజీగా ఉన్న కారణంగా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావాలంటే మరో సంవత్సరం పట్టవచ్చు. మహర్షి సినిమా తర్వాత మహేష్ కోసం సంవత్సరం దాకా వెయిట్ చేసిన వంశీ మరో సంవత్సరం వెయిట్ చేయడం కష్టమే.. ఈ దెబ్బతో వంశీ చిన్న హీరోలతో సినిమా చేస్తాడేమో అని అనుకుంటున్నారు. మరి ఈ సారైనా స్టార్ హీరోని కాదని మిడ్ రేంజ్ హీరోల దగ్గరకి వస్తాడా లేడా చూడాలి.