ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నాడు. లారెన్స్ ఎప్పట్నుంచో ఎంతో మంది అనాధ పిల్లలను, దివ్యాంగులను అక్కున చేర్చుకుని వారికి అన్నీ తానై చూసుకుంటున్నాడు. ఇలా తనకు కష్టమొచ్చిందని కానీ.. ఫలానా అవసరం ఉందని చెబితే కచ్చితంగా తనవంతుగా సాయం చేయడానికి లారెన్స్ ప్రయత్నాలు చేస్తుంటాడు. మరీ ముఖ్యంగా విపత్కర పరిస్థితుల్లో అందరి కంటే ముందుగా విరాళాలు సైతం ప్రకటిస్తుంటాడు. ఇప్పుడు కరోనాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధం చేస్తున్నాయి.. మరోవైపు లాక్‌డౌన్‌తో నిరుపేదలు, దినసరి కూలీలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో పెద్ద మనసుతో రూ. 3 కోట్లు తాను విరాళంగా ఇస్తున్నట్లు లారెన్స్ ప్రకటిస్తున్నట్లు అభిమానులు, ఫ్రెండ్స్‌కు తెలియజేశాడు.
ఇందులో..
పీఎం కేర్స్ ఫండ్‌కు : రూ. 50 లక్షలు
తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్‌కు : రూ. 50 లక్షలు
ఫెప్సీ యూనియన్‌కు : రూ. 50 లక్షలు
డ్యాన్సర్స్ యూనియన్‌కు : రూ. 50 లక్షలు
తన దగ్గరున్న దివ్యాంగులకు : రూ రూ. 25 లక్షలు
తన సొంతూరైన రోయపురానికి చెందిన దినసరి కూలీలు, ప్రజల కోసం : రూ. 75 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా లారెన్స్ చెప్పాడు.
ఒక్కరూపాయి కూడా..
కాగా.. సూపర్ స్టార్ రజినీకాంత్ తదుపరి చిత్రం ‘చంద్రముఖి-2’లో లారెన్స్ నటించబోతున్నాడు. రజినీ సార్ అనుమతి, ఆశీస్సులతో సినిమాలో నటిస్తున్నందుకు చాలా అదృష్టవంతుడిగా ఫీలవుతున్నట్లు తెలిపాడు. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ తనకు రూ. 3 కోట్లు అడ్వాన్స్‌గా ఇచ్చారు. ఆ మొత్తం డబ్బులను కరోనా వైరస్ రిలీఫ్ ఫండ్‌గా ఇస్తున్నట్లు ప్రకటించాడు. అయితే అడ్వాన్స్‌గా తీసుకున్న మొత్తం మూడు కోట్ల రూపాయిల్లో ఒక్క రూపాయి కూడా తాను తీసుకోకుండా అంతా విరాళంగా ఇవ్వడమంటే మామూలు విషయం కాదు. లారెన్స్ చేస్తున్న ఈ సాయానికి అభిమానులు, మిత్రులు, చిత్ర పరిశ్రమ, ప్రభుత్వం, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తోంది.