అల వైకుంఠపురములో సినిమా ప్రమోషన్లలో భాగంగా బన్నీ నేషనల్ మీడియాకి కూడా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. వరుసగా ఒకదాని తర్వాత మరో ఇంటర్వ్యూలో కనిపిస్తున్నప్పుడే అల్లు అర్జున్ కి పాన్ ఇండియా రేంజ్ మీద మక్కువ పెరిగిందని అర్థమైంది. అయితే ఆ కోరిక దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఐకాన్ సినిమాతో తీరనుందని అనుకున్నారు. అప్పట్లో ఆ సినిమాలో బన్నీ సరసన నటించడానికి బాలీవుడ్ భామని తీసుకోవడానికి ప్రయత్నాలు జరిగాయి.
కానీ, బన్నీ ఐకాన్ ని పక్కన పెట్టి సుకుమార్ తో సినిమా స్టార్ట్ చేశాడు. బన్నీ- సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి పుష్ప అనే టైటిల్ ని పెట్టి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతుంది. అయితే పుష్పని పాన్ ఇండియా సినిమాగా మలచడం సరైన నిర్ణయమేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మనకి తెలిసిన దాని ప్రకారం ఈ సినిమా కథ తెలుగు నేటివిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఇతర భాషల వాళ్ళు ఆదరిస్తారా అన్న సందేహం కలుగుతుంది.
అయితే సినిమాలోని క్యారెక్టర్లని బట్టి చూస్తే పుష్ప పాన్ ఇండియాగా వైడ్ గా పేరు తెచ్చుకునేలా ఉంది. తెలుగుతో పాటు మళయాలంలో అల్లు అర్జున్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే బన్నీ సినిమాల హిందీ వెర్షన్స్ కి మిలియన్ల వ్యూస్ వస్తుంటాయి. హీరోయిన్ గా నటిస్తున్న రష్మికాకి కన్నడలో మంచి పేరుంది.. సో అక్కడ ఢోకా లేనట్టే.. ఇక తమిళ ప్రేక్షకుల కోసం విజయ్ సేతుపతి ఉండనే ఉన్నాడు. కాబట్టి పుష్పతో బన్నీ తీసుకున్న నిర్ణయం సరైనదే అనిపిస్తుంది.