‘కబీర్ సింగ్’ నిర్మాత చేతిలో ‘అల వైకుంఠపురములో’ రీమేక్ రైట్స్
కొద్ది రోజుల క్రితం ‘అల వైకుంఠపురములో’ హిందీ రీమేక్ హక్కుల కోసం వచ్చిన ఆఫర్‌ను అల్లు అరవింద్ తిరస్కరించారు. కారణం, ఆ బాలీవుడ్ నిర్మాత చేసిన రూ. 8 కోట్ల ఆఫర్ ఆయనకు తృప్తినివ్వకపోవడం. ఒకానొక సమయంలో తనే ఆ సినిమాని బాలీవుడ్‌లో రీమేక్ చేయాలని కూడా అరవింద్ భావించారు. తాజా సమాచారం ప్రకారం ఆ ఆలోచనను ఆయన విరమించుకున్నారు. ఒక బాలీవుడ్ నిర్మాత ‘అల వైకుంఠపురములో’ రీమేక్ హక్కులు భారీ మొత్తం చెల్లించి దక్కించుకున్నారని వినిపిస్తోంది.
ఆ నిర్మాత ఎవరో కాదు, ఇదివరకు రూ. 8 కోట్లు ఆఫర్ చేసి కాదనిపించుకున్న అశ్విన్ వర్దే. అవును. ఇప్పుడాయన మరింత భారీ ఆఫర్‌ను ముందుకు తేవడంతో అరవింద్ దానిని ఓకే చేశారు. అశ్విన్ వర్దే ఎవరంటే.. విజయ్ దేవరకొండను రాత్రికి రాత్రే స్టార్‌ను చేసిన ‘అర్జున్‌రెడ్డి’ సినిమాని షాహిద్ కపూర్ హీరోగా ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసిన నిర్మాత. ఇప్పుడాయన ‘అల వైకుంఠపురములో’ చిత్రాన్ని హిందీలో తీసేందుకు సంకల్పించాడు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా, నాన్-బాహుబలి2 రికార్డును సొంతం చేసుకొన్న ‘అల వైకుంఠపురములో’ హిందీ రీమేక్‌లో ఏ హీరో నటిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ‘అర్జున్‌రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’లో నటించిన షాహిద్ కపూర్ లేదా వరుణ్ ధావన్‌లలో ఎవరో ఒకరు చేసే అవకాశాలున్నాయని బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ‘కబీర్ సింగ్’ తర్వాత షాహిద్ కపూర్ మరో తెలుగు రీమేక్ ‘జెర్సీ’ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతడు వరుసగా మూడో తెలుగు రీమేక్ చేసే విషయంలో అనుమానాలున్నాయి. వరుణ్ ధావన్ చేస్తాడనుకున్నా.. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న కమిట్‌మెంట్స్ చూస్తే ఇంకో ఏడాది దాకా ఆయన కొత్త సినిమాని చేపట్టే అవకాశాలు లేవు. దాంతో హీరో విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. డైరెక్టర్ ఎవరనేది మాత్రం ఇంకా వెల్లడి కాలేదు.
2020 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన ‘అల వైకుంఠపురములో’ మూవీ అనూహ్య విజయాన్ని సాధించింది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ విడుదలకు ముందు మ్యూజికల్‌గా బ్లాక్‌బస్టర్ అయ్యింది. తమన్ స్వరాలు కూర్చిన పాటలు యూట్యూబ్‌లో వ్యూస్ పరంగా రికార్డులు బద్దలుకొట్టాయి. బంటూ కేరక్టర్‌లో బన్నీ రాణించిన విధానం, పూజా హెగ్డేతో ఆయన కెమిస్ట్రీ, ఫ్యామిలీ సెంటిమెంట్, ఎంటర్‌టైన్‌మెంట్, త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ కలిసి ఈ సినిమాను బ్లాక్‌బస్టర్ చేశాయి. హిందీలో ఆ తరహా మ్యాజిక్‌ను ఈ సినిమా సాధిస్తుందా?