కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో.. దానిపై పోరాటం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాజకీయ, సినీ, వ్యాపార రంగాల నుంచి పెద్ద ఎత్తున విరాళాలు వస్తున్నాయి. ఇందులో టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. మరోవైపు.. లాక్‌డౌన్‌తో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న సినీ కార్మికులకు సైతం ట్రస్ట్ ఏర్పాటు చేసి విరాళాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే కార్మికులకు నిత్యావసరాలు పంచే పనిలో టీమ్ నిమగ్నమైంది కూడా. మరోవైపు కొందరు హీరోలు ఎవరికి తోచినంత వారుగా పేద ప్రజలకు సాయం చేస్తున్నారు. నెలరోజులకు సరిపడా సరుకులు అందజేయడం.. 50 పేదకుటుంబాలకు కొందరు.. తాము చేస్తున్న సినిమా యూనిట్‌కు కొందరు ఇలా దాదాపు అందరూ స్పందిస్తూ సాయం చేస్తున్నారు.
టాలీవుడ్ మాత్రమే..
ఇవన్నీ అటుంచితే నిత్యం సోషల్ మీడియా వేదికగా సినీ ప్రియులకు, అభిమానులకు, దేశ ప్రజలకు తమ వంతుగా సలహాలు, సూచనలు కూడా చేస్తూనే ఉన్నారు. మరోవైపు సింగర్స్ కరోనాపై కొత్త కొత్త పాటలు పాడుతూ ప్రజలను చైతన్య పరుస్తూనే ఉన్నారు. వాస్తవానికి కరోనాపై పోరులో ఏ సినీ ఇండస్ట్రీ కూడా ఈ రేంజ్‌లో పాలుపంచుకోలేదు. అది వన్ అండ్ ఓన్లీ టాలీవుడ్‌కు సాధ్యమైంది. కరోనా విస్తరిస్తోందని ‘జనతా కర్ఫ్యూ’, ‘లాక్‌డౌన్’ విధించకముందే స్వచ్ఛందంగా టాలీవుడ్‌లో షూటింగ్, సినిమా రీలీజ్‌లు మరీ ముఖ్యంగా థియేటర్స్‌ను మూసేస్తున్నట్లు ప్రకటించడం సంతోషించదగ్గ విషయం. ఇలా ఒకటని కాదు చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయ్. ఇన్ని పనులు ఇంతవరకూ బాలీవుడ్ కూడా చేయలేదంటే అర్థం చేస్కోవచ్చు. ఒకరని కాదు.. స్టార్లు, సీనియర్ హీరోలు మొదలుకుని చిన్నపాటి హీరోలు, నటీమణులు, దర్శకనిర్మాతలు, జూనియర్ ఆర్టిస్ట్‌లు ఇలా దాదాపు అందరూ తమవంతుగా సాయం చేయడం జరిగింది.
నిజంగా గ్రేటే..!
ఇక లాక్‌డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారో..? తెలియని పరిస్థితి. ఇప్పటికే టాలీవుడ్ ఈ కరోనా కాటుతో భారీగానే నష్టపోయింది. ఒకవేళ లాక్‌డౌన్ పొడిగిస్తే మరీ కష్టమే. అయినప్పటికీ ఈ నష్టాలను.. కష్టాలను లెక్కచేయకుండానే సాయం చేయడానికి టాలీవుడ్ ముందుకొస్తోందంటే నిజంగా గ్రేట్.. మన ఇండస్ట్రీకి హ్యాట్సాఫ్ తప్పక చెప్పాల్సిందే మరి. మరీ ముఖ్యంగా సేవా దృక్పథంతో ముందుకొస్తున్న ప్రతి ఒక్కర్నీ అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు.. ఇటు ఇండస్ట్రీ తరఫున పెద్దలు భుజం భుజం కలిపి మంచి పనులు చేస్తున్న వారిని సైతం అభినందించాల్సిందే. మొత్తమ్మీద.. రియల్లీ గ్రేట్.. హ్యాట్సాఫ్ టు టాలీవుడ్!.