మెగాస్టార్ చిరంజీవి- హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ కాంబోలో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతున్న విషయం విదితమే. అన్నీ అనుకున్నట్లు జరిగుంటే ఈ టైమ్‌కల్లా సినిమా సగానికి పైగా షూటింగ్ పూర్తయ్యేది.. కరోనా మహమ్మారి దెబ్బతో యావత్ ప్రపంచ వ్యాప్తంగా సినిమా షూటింగ్‌లు, రిలీజ్‌లు సర్వం బంద్ అయ్యాయి. ఈ దెబ్బ ‘ఆచార్య’పై కూడా పడింది. టాలీవుడ్‌లో అందరికంటే ముందుగా సినిమా షూట్‌ను వాయిదా వేసుకుంది ఈ చిత్ర యూనిటే. వాస్తవానికి ఈ సినిమాను ఆగస్ట్-14న అనగా.. స్వాత్రంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు ఫిక్స్ అయ్యారు. అయితే ఈ సినిమా ఈ ఏడాది కాదు కదా వచ్చే ఏడాది వేసవి సెలవుల్లో కూడా రావడం కష్టమేనని తెలుస్తోంది.
ఈ క్రమంలో.. మెగాభిమానుల్లో ఏడాది పాటు ఎదురుచూపు తప్పదనే నిరాశ, నిస్పృహలు మిగిలిపోయాయ్. అయితే ఫ్యాన్స్‌ను సంతృప్తిపరచడానికి ‘అన్నయ్య’ అనుకున్న టైమ్‌కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ‘వకీల్ సాబ్’తో ‘తమ్ముడు’ వచ్చేస్తున్నాడట. అంటే ‘అన్నయ్య’ స్థానాన్ని భర్తీ చేయడానికి ‘తమ్ముడు’ వస్తున్నాడన్న మాట. మెగాభిమానుల్లో ఆ డేట్ అలా ఫిక్సయిపోయిందని.. ఇదే టైమ్‌కు మనం రంగంలోకి దిగితే క్యాష్ చేసుకోవచ్చని ఈ మేరకు దర్శకనిర్మాతలు ప్లాన్ వేస్తున్నారట. పైగా.. పవన్ రీ ఎంట్రీ సినిమా కావడం.. అందులోనూ రీమేక్ సినిమా కావడంతో ఇంతకంటే మరో ఛాన్స్ ఉండదని కచ్చితంగా ‘అన్నయ్య’ అనుకున్న టైమ్‌కే వచ్చేయాలని భావిస్తున్నారట.
నిజానికి.. ‘వకీల్‌సాబ్’ను మే 15న విడుదల చేయాలని ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, బోనీ కపూర్ ఫిక్స్ అయ్యారు.. ఈ విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. అయితే కరోనా దెబ్బతో సినిమాలన్నీ ఆగిపోవడంతో ఒకనెల గ్యాప్ ఇచ్చి జూలైలో రిలీజ్ చేయాలని భావించారట. అయితే ఎలాగో ఇప్పట్లో మెగాస్టార్ సినిమా లేదు కదా అని ఆ రోజునే ‘వకీల్‌సాబ్’ను థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారట. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే దిల్ రాజ్‌కు రియాక్ట్ అవ్వాల్సిందే.