టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు హీరో బేస్డ్ సినిమాలకే మార్కెట్ ఎక్కువగా ఉంటుంది. హీరోయిన్లు గ్లామర్ తో పాటు నటనతో ఆకట్టుకున్నప్పటికీ వారికి ఉండే మార్కెట్ హీరోల కన్నా చాలా తక్కువే. అయితే కొంతమంది హీరోయిన్లకి మాత్రం హీరో లెవెల్ లో మార్కెట్ ఉంటుంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలకి కూడా ఒక్కోసారి రికార్డు స్థాయిలో కలెక్షన్లు వస్తాయి.
బాలీవుడ్ లో హీరోలకి ఏమాత్రం తగ్గకుండా మార్కెట్ పెంచుకున్న హీరోయిన్ కంగనారనౌత్, ప్రస్తుతం తలైవి అనే చిత్రంలో నటిస్తుంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా బాహుబలి రచయిత సమకూర్చిన కథతో తెరకెక్కుతున్న బయోపిక్ లో కంగనా జయలలిత పాత్రలో కనిపిస్తుంది. తెలుగు, హిందీ, తమిళ భాషలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కంగనా నాలుగు గెటప్పుల్లో కనిపిస్తుందట.
కే ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి వందకోట్ల వరకి ఖర్చు అవుతుందట. అయితే ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాకి అంత డబ్బు రికవరీ అవుతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. కానీ జయలలిత జీవిత కథతో వస్తుంది కాబట్టి ఆమెకి ఉన్న స్టార్ డమ్ వల్ల వందకోట్లు రికవరీ చేయడం అంత కష్టం కాదని అంటున్నారు. అయితే ఎంత మంచి బయోపిక్ అయినా దర్శకుడు సరిగ్గా తీర్చిదిద్దకపోతే ప్రేక్షకులు బోర్ ఫీలయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మరి కే ఎల్ విజయ్ ఈ సినిమాని ఏ విధంగా తీర్చిదిద్దాడో..?