కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో టాలీవుడ్‌లో సోమవారం ఒక్కరోజే రెండు విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల సోదరి శ్రీలక్ష్మి.., ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తల్లి కృష్ణవేణి కన్నుమూశారు. ఈ వరుస ఘటనలతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అంతేకాదు.. లాక్‌డౌన్ ఉండటంతో కనీసం మృతుల ఇంటికెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించే పరిస్థితి కూడా లేదు. అసలు వీరిద్దరూ ఎలా చనిపోయారు..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాన్సర్‌తో శ్రీలక్ష్మి మృతి..
రాజీవ్ కనకాల సోదరి, ప్రముఖ టీవీ నటి శ్రీలక్ష్మి గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం సాయంత్రం కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే ఆమె తుదిశ్వాస విడిచారు. అయితే గత ఏడాదే కనకాల ఇంట తండ్రి దేవదాస్ కనకాల చనిపోవడంతో విషాదం నెలకొంది. ఈ ఘటన మరువక ముందే మరో తీవ్ర దిగ్భ్రాంతి కలుగజేసే ఘటన చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తండ్రి దేవదాస్ కనకాల రూపొందించిన ‘రాజశేఖర చరిత్ర’ అనే సీరియల్ ద్వారా శ్రీలక్ష్మి బుల్లి తెరకు పరిచయం అయ్యారు. ఈ సీరియల్‌తో పాటు పలు సీరియల్స్‌లో నటించి మెప్పించారామె. మరీ ముఖ్యంగా యాంకర్ సుమకు, రాజీవ్ కనకాలతో పెళ్లి కాక ముందు నుంచే శ్రీలక్ష్మీకి మంచి ఫ్రెండ్స్. వీరిద్దరిని కలపడానికి.. పెళ్లి చేయడంలో కూడా శ్రీలక్ష్మి సాయం చేసిందని చెబుతుంటారు.
ఇదిలా ఉంటే.. శ్రీలక్ష్మి మృతిపట్ల పలువురు సినీ ఇండస్ట్రీ చెందిన ప్రముఖులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా.. ఈ సందర్భంగా.. ‘కరోనా’ నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతున్న పరిస్థితుల రీత్యా శ్రీలక్ష్మి భౌతికకాయాన్ని సందర్శించేందుకు ఎవరూ రావొద్దని శ్రీలక్ష్మి కుటుంబసభ్యులు మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. కాగా రేపు మధ్యాహ్నం అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది.
అనారోగ్యంతో తమ్మారెడ్డి కృష్ణవేణి మృతి..
తమ్మారెడ్డి భరద్వాజ మాతృమూర్తి కృష్ణవేణి (94) సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణవేణి ఆమె సోమవారం ఇవాళ కన్నుమూశారు. తల్లి మృతితో తమ్మారెడ్డి ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు తమ్మారెడ్డికి ఫోన్ చేసి పరామర్శించారు. అయితే.. తన మిత్రులు, శ్రేయోభిలాషులు చాలా మంది ఫోన్లు చేస్తున్నారని, కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నందున తనను పరామర్శించడానికి ఎవరూ ఇంటికి రావద్దని తమ్మారెడ్డి కోరారు.