ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి బారీన పడకుండా ఉండాలని సీని ప్రముఖులు పదే పదే సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు, వీడియోల ద్వారా చెబుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ బయటతిరిగితే కఠిన చర్యలు తప్పవని తేల్చిచెప్పేశాయి. మరికొన్ని ఏరియాల్లో రెడ్ జోన్‌లుగా సైతం ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ ఎవరూ చెబితే మాకేంటి.. మేం ఎవరి మాటా వినం.. అని లోకానికి విరుద్ధంగా కొందరు యథేచ్ఛగా తిరిగేస్తున్నారు.
అయితే.. ఈ మొత్తం వ్యవహారంపై తాజాగా సీనియర్ హీరోయిన్.. టాలీవుడ్‌ను ఒకప్పుడు ఓ ఊపు ఊపిన మీనా స్పందించింది. కరోనా కట్టడి కోసం మన ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లాక్ డౌన్ విధించినప్పటికీ కొంతమంది వ్యక్తులు ఇంకా రోడ్లపై తిరుగుతుండటం బాధగా ఉందని చెప్పింది.
దండం పెట్టి చెబుతున్నా..!
‘ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్ లాంటి దేశాలు ఇప్పుడు ఎలాంటి ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయో తెలుసా?. ఆయా దేశాల్లో ఒక రోజులోనే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. గవర్నమెంట్ చెప్పింది వినకుండా ఇష్టమొచ్చినట్లు చేసినందుకే ఇప్పుడు ఆయా దేశాల్లో (ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్) శవాలు గుట్టలు గుట్టలుగా పడిపోయాయి. కనీసం చనిపోతే శవాలు ముట్టుకోడానికి కూడా ఎవరూ రావడం లేదు. దయచేసి ఇండియాను అలా చేయొద్దు (దండంపెడుతూ). అదే, అమెరికా దేశంలో అయితే రెండున్నర లక్షల మందికి పైగా ఈ వైరస్‌తో ఇబ్బందిపడుతున్నారు. ఇంట్లోనే కూర్చుని ప్రపంచాన్ని కాపాడే అవకాశం అందరికీ దొరకదు. మీరు జాగ్రత్తగా ఉంటేనే మీ కుటుంబం ఆరోగ్యంగా, భద్రంగా ఉంటుంది. దయచేసి ప్రభుత్వం చెప్పినట్లుగా నడుచుకోండి’ అని మీనా చేతులెత్తి మరీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.