బోయపాటి శ్రీనివాస్ డైరక్షన్ టీంలో పనిచేసిన కొరటాల శివ మిర్చి సినిమాతో దర్శకుడిగా మారాడు. మొదటి సినిమాతోనే తానెంత స్టైలిష్ గా సినిమా తీయగలడో చూపించాడు. ప్రభాస్ ని అప్పటి వరకూ చూడనంత కొత్తగా తెరమీద చూపించాడు కొరటాల. మిర్చి నుండి మొన్న వచ్చిన భరత్ అనే నేను వరకు కొరటాల కేరీర్లో అన్నీ పెద్ద హిట్లే ఉన్నాయి. సమాజానికి మేలు చేసే కథాంశాలని ఎన్నుకుంటూ డిఫరెంట్ గా సినిమాలు చేస్తున్నాడు.
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య అనే సినిమా తెరకెక్కుతోంది. సైరా నరసింహారెడ్డి వంటి పాన్ ఇండియా చిత్రం తర్వాత చిరంజీవి చేస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు బాగా ఉన్నాయి. కాజల్ ఈ సినిమాలో ప్రధాన హీరోయిన్ గా కనిపించనుంది. కరోనా కారణంగా షూటింగ్ కొన్ని రోజుల పాటు వాయిదా పడింది. అయితే కరోనా వల్ల రోజువారి సినీ కార్మికులు పడుతున్న ఇబ్బందులని తీర్చేందుకు చిరంజీవి ఆద్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీని ఏర్పాటు చేశారు. ఈ ఛారిటీకి విరాళాలు చాలానే వచ్చాయి.
అయితే తాజాగా చిరంజీవి కొరటాల వ్యక్తిత్వం గురించి మాట్లాడాడు. కొరటాల శివ ఎప్పుడూ సమాజం గురించి ఆలోచిస్తాడట. దిగజారుతున్న రాజకీయాల గురించి, రాజకీయ నాయకుల ప్రవర్తన గురించి.. వారి వల్ల సామాన్య మానవులు ఎలా మోసపోతున్నారో అని ఆందోళన చెందుతాడట. ఆ ఆందోళన నుండే తను కోరుకునే రాజకీయ నాయకుడి గురించి భరత్ అనే నేను సినిమా తీసుంటాడని అన్నారు.