టాలీవుడ్ టాప్ రేంజ్ హీరోయిన్ పూజా హెగ్డేకు అల వైకుంఠపురములో సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత క్రేజ్ మరింతగా పెరిగింది. ప్రస్తుతం ప్రభాస్ సినిమాలోను, అఖిల్ సినిమాలోనూ నటిస్తున్న పూజా హెగ్డే.. అఖిల్ సినిమా కోసం హీరో అఖిల్ కన్నా ఎక్కువ పారితోషకం అందుకుంటుంది అంటున్నారు. అయితే తెలుగులో దూసుకుపోతున్న పూజా హెగ్డే బాలీవుడ్ లోను సల్మాన్ ఖాన్ సినిమాతో అక్కడ కూడా బిజీ. అయితే ఫుల్ బిజీగా ఉన్న పూజా హెగ్డే తమిళనాట కూడా దున్నేయ్యడానికి రెడీ అవుతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. సూర్య - హరి కాంబోలో తెరకెక్కబోయే యాక్షన్ ఎంటెర్‌టైనర్ తమిళ సినిమా కోసం పూజా హెగ్డేని సంప్రదించినట్లుగా... పూజా హెగ్డే కూడా ఒప్పుకున్నట్లుగా వార్తలొచ్చాయి.
అయితే పూజా హెగ్డే కోలీవుడ్ ఎంట్రీపై వస్తున్న వార్తలకు స్పందించింది. ప్రస్తుతం కరోనా కారణంగా హోమ్ క్వారంటైన్ లో ఉన్న పూజా హెగ్డే తానే తమిళ సినిమాలో నటించడం లేదని.. ఇంతవరకు ఒక్క తమిళ సినిమాకి సైన్ చెయ్యలేదని చెబుతుంది. నేనింతవరకు ఏ సినిమా ఒప్పుకోలేదు. కానీ తమిళ సినిమాల కోసం కథలు వింటున్నాను. అన్ని సవ్యంగా జరిగితే.. కచ్చితంగా ఈ ఏడాది ఓ తమిళ సినిమా చేస్తా అంటూ.. సూర్య సినిమాపై అస్పష్టమైన క్లారిటీ ఇచ్చింది. మరి సూర్య సినిమా కాకపోతే విజయ్ లేదా అజిత్.. ఏదో ఒక సినిమాతో పూజ తమిళ ఎంట్రీ ఈ ఏడాది ఖాయమన్నమాట.