ప్రఖ్యాత కర్ణాటక విద్వాంసురాలు, సాంస్కృతిక కార్యకర్త, పరిశోధకురాలు అయిన బెంగుళూరు నాగరత్నమ్మ పాత్రను అనుష్క పోషించనున్నట్లు ఇప్పటిదాకా ప్రచారం జరుగుతూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అనుష్క స్థానంలో సమంత పేరు వినిపిస్తోంది. కర్ణాటక విద్వాంసుడు త్యాగరాజుకు గుడి కట్టి, త్యాగరాజ ఆరాధనోత్సవాలు ప్రారంభించడంలో ప్రముఖ పాత్ర వహించిన విదుషీమణిగా నాగరత్నమ్మ కీర్తి గడించారు. ఆమె బయోపిక్‌ను రూపొందించడానికి లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ప్రయత్నిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి.జి. విశ్వప్రసాద్ ఈ మూవీని నిర్మించేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం.
ఆ పాత్రను చేయగల నటికోసం సింగీతం చేస్తున్న అన్వేషణ అనుష్క వద్ద ఆగిందని వారం పది రోజుల క్రితం మొదటిసారి ఫిల్మ్‌నగర్‌లో వినిపించింది. నాగరత్నమ్మ పాత్రను అనుష్క కంటే గొప్పగా పోషించగల నటి మరొకరు లేరని ఆయన భావించారనీ, ఆమెను కలిసి స్క్రిప్టు వినిపించడానికి సింగీతం సిద్ధమయ్యారు కూడా. నాగరత్నమ్మ జీవితంలో అనేక పార్శ్వాలున్నాయనీ, స్వయంగా దేవదాసి అయిన ఆమె, ఆ వ్యవస్థను రూపుమాపడానికి చేసిన కృషి, దాని కోసం ఆమె ఎదుర్కొన్న అడ్డంకులు, పడ్డ బాధలు అన్నీ ఇన్నీ కావనీ, అలాంటి పాత్రకు అనుష్క అయితేనే న్యాయం చేయగలదనీ ఆయన అనుకున్నారు. అయితే అదంతా గతమనీ, ఇప్పుడు సమంతకు సింగీతం స్క్రిప్టు వినిపించారనీ, వెంటనే నాగరత్నమ్మ పాత్రను చేయడానికి సమంత అంగీకరించిందనీ సమాచారం. అన్నీ అనుకూలిస్తే సమీప భవిష్యత్తులోనే మనం నాగరత్నమ్మ పాత్రలో సమంతను చూసే అవకాశం ఉంది.
అనుష్క తర్వాత టాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌కు సమంత చిరునామాగా మారింది. ‘యు టర్న్, ఓ బేబీ, జాను’ వంటి సినిమాల్లోనూ.. అదివరకు ‘అ ఆ, మజిలీ’ వంటి చిత్రాల్లో చేసిన పాత్రలతోనూ నటిగా సమంత అభినయం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం తమిళ దర్శకుడు అశ్విన్ శరవణన్ డైరెక్షన్‌లో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రాన్ని ఆమె చేస్తోంది. ఇక సింగీతం శ్రీనివాసరావు విషయానికి వస్తే చివరిసారిగా ఆయన ఏడేళ్ల క్రితం ‘వెల్‌కమ్ ఒబామా’ అనే చిత్రాన్ని రూపొందించారు. 88 ఏళ్ల వయసులోనూ చురుకుగా ఉన్న ఆయన మళ్లీ మెగాఫోన్ ఎప్పుడెప్పుడు పట్టుకుందామా అని ఎదురు చూస్తున్నారు.