కరోనా వైరస్ ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కరోనా దెబ్బకు ప్రపంచం మొత్తం మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు దాదాపు షట్ డౌన్ అయ్యాయి. ఇప్పటికే థియేటర్స్, సినిమా షూటింగ్స్‌ను వాయిదా వేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన సినిమా సెలబ్రిటీలు తమవంతుగా జనాల్లో చైతన్యం కలిగిస్తున్నారు. ఇప్పటికే.. మెగాస్టార్ చిరంజీవి, విజయ్ దేవరకొండ, రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు స్పందించి తమ వంతుగా జాగ్రత్తలు, సలహాలు, సూచనలు, చిట్కాలు షేర్ చేసుకున్నారు. అంతేకాదు.. తమవంతుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు.. సినీ కార్మికులను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన సీసీసీ చారిటీకి విరాళాలు ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నారు.
నాలుగో సింహామే మీరు..!
అయితే.. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు, డైలాగ్ కింగ్ సాయికుమార్ ఓ వీడియోను షేర్ చేసుకున్నారు. ఇందులో నిజంగా సినిమా డైలాగ్స్ పేల్చేశారు. అంతేకాదు.. ఆయన ఫేమస్ డైలాగ్.. కనిపించే మూడు సింహాలు.. కనిపించని అని చెప్పే సాయికుమార్.. ఈ డైలాగ్‌ను ఈ వీడియోలో పేల్చారు. ఇంతకీ ఆయన వీడియోలో ఇంకా ఏమేం ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ‘అందరికీ నమస్కారం.. ఇది మన సంస్కారం. కనిపించే మూడు సింహాలు డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ కార్మికులు అయితే కనిపించని నాలుగో సింహామే మీరు.. మీరు అంటే మనం.. మనం అంటే దేశం.. దేశం అంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్. దేశం మనకేం చేసిందాని కంటే దేశానికి మనం ఏం చేశామన్నదే ముఖ్యం. ఈ రోజు మనం గొప్ప సేవ చేయాల్సిన అక్కర్లేదు’ అని చెప్పిన సాయికుమార్ మరిన్ని విషయాలు పంచుకున్నారు.
మీరు బతికి.. బతకనివ్వండి!
‘మన ఇళ్లలో మనం కూర్చుంటే చాలు. ప్రభుత్వం ఇస్తున్న సూచనలను పాటిస్తూ.. స్వీయ నియంత్రణతో శుభ్రతతో క్రమశిక్షణతో మీ తల్లిదండ్రులతో మీ భార్యా పిల్లలతో మీ కుటుంబాలతో మీరు ఇంట్లో ప్రశాంతంగా ఉంటే చాలు. మీరు బతకండి మిగతావారిని బతకనివ్వండి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనమందరం కలిసికట్టుగా దేశం కోసం ప్రపంచం కోసం పోరాడుదాం. కరోనా అనే వైరస్‌ను తరిమికొడదాం. ఆ మహమ్మారి నుంచి ప్రపంచాన్ని కాపాడుదాం. సర్వేజనా సుఖినోభవంతు’ అని సాయికుమార్ చెప్పుకొచ్చారు.